Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం, కాచిగూడ-యశ్వంత్పూర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ రైళ్ల షెడ్యూల్లో పలు మార్పులు చేసింది. ఈ రైల్వే బోర్డు ఆమోదం మేరకు ఆయా రైళ్ల నిర్వహణ రోజులను మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. షెడ్యూల్ మేరకు కాచిగూడ – యశ్వంత్పూర్ (20703), యశ్వంత్పూర్-కాచిగూడ (20704) రైలు ప్రతి శుక్రవారం మినహా మిగతా మిగతా ఆరురోజులు రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు బుధవారం మినహా మిగతా రోజుల్లో సెమీ హైస్పీడ్ రైలు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 4 నుంచి శుక్రవారం రోజున సేవలు అందుబాటులో ఉండవని చెప్పింది.
అలాగే, సికింద్రాబాద్-విశాఖపట్నం (20707), విశాఖపట్నం-సికింద్రాబాద్ (20708) రైలు సోమవారం మినహా మిగతా రోజుల్లో రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం గురువారం మినహా మిగతా రోజుల్లో రైలు రాకపోకలు సాగిస్తుంది. అయితే, డిసెంబర్ 5 నుంచి ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉండదని పేర్కొంది. అయితే, ఆయా రైళ్ల ప్రయాణ సమయంలో ఎలాంటి మార్పులు ఉండవని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఈ మార్పులు ప్రయాణికులు గమనించాలని కోరింది. ఇదిలా ఉండగా.. నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు ఈ నెల 15 నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.