Special Trains | కేరళలోని పతినంతిట్ట జిల్లాలో కొలువైన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్ప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వెళ్తారు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని మౌలాలి, ఏపీలోని మచిలీపట్నం నుంచి కేరళలోని కొల్లం వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పింది. మౌలాలి – కొల్లం (07143) స్పెషల్ రైలు నవంబర్ 22, 29 తేదీల్లో నడుస్తాయని తెలిపింది. శుక్రవారాల్లో ఉదయం 11.30 గంటలకు మౌలాలి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కోల్లాం చేరుతుంది.
ఇక కొల్లం – మౌలాలి ((07143) మధ్య నవంబర్ 24, డిసెంబర్ ఒకటి తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 10 గంటలకు మౌలాలి స్టేషన్‌కి చేరుకుంటుంది. రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైలు చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈ-రోడ్, తిరుపూర్, కొయంబత్తూరు, పాలక్కడ్, త్రిసూర్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సేరి, చెంగనూరు, కాయన్‌కులం స్టేషన్లలో ఆగుతుందని చెప్పింది. ఇక మచిలీపట్నం – కొల్లాం స్పెషల్ (07145) ట్రైన్ ఈ నెల 25న సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 9.20 గంటలకు కొల్లానికి చేరుతుంది.
కొల్లాం- మచిలీపట్నం మధ్య (07146) ఈ నెల 20, 27 అందుబాటులో ఉండనున్నది. బుధవారం వేకువ జామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి గురువారం ఉదయం 10 గంటలకు మంచిలీపట్నం చేరుతుంది. రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్ట్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. రైలు రెండుమార్గాల్లో పెడన, గుడివాడ, విజయవాడ, న్యూ గుంటూరు తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గుడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈ-రోడ్, కొయంబత్తూరు, పాలక్కడ్, ఎర్నాకుళం టౌన్, ఎట్టుమనూరు, కొట్టాయం, చంగనస్సేరి, తిరువల్ల, చెంగనూరు, కాయంకులం స్టేషన్లలో ఆగుతాయని వివరించింది.