Special Trains | షిర్డీ సాయిబాబా భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ – నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 3 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్ – నాగర్ సోల్ రైలు (07007) రైలు జులై 3 నుంచి ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. నాగర్ సోల్ -సికింద్రాబాద్ (07002) రైలు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ రైలు రెండుమార్గాల్లో మల్కాజ్గిరి, బొల్లారం, మేడ్చెల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఈ రైలులో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.