మలక్‌పేట, జూన్ 26: మానవత్వం మంటగలుస్తున్నది. మానవ సంబంధాలు మసకబారుతున్నాయి. తల్లిదండ్రులు, తోబుట్టువుల పట్ల అనుబంధాలు సైతం ఆర్థిక సంబంధాల ముందు చిన్నబోతున్నాయి. తల్లిదండ్రుల ఆస్తులను అనుభవిస్తూ వారినే ఇంటి నుంచి బయటికు గెంటేస్తున్న ఉదంతాలు మానవత్వానికి మచ్చగా నిలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. సైదాబాద్ మండలం తహసీల్దార్ జయశ్రీ కథనం ప్రకారం ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన శకుంతలాబాయి (90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. చాలాఏండ్ల క్రితమే భర్త చనిపోవడంతో తన నివాసంలో కొడుకులతో కలిసి జీవిస్తున్నది. తల్లి ఆలనా పాలనా చూడాల్సిన కుమారులు ఆమెను నిర్లక్ష్యం చేస్తూ ఆస్తిని లాక్కున్నారు.
సైదాబాద్‌లోని తన చిన్న కూతురు వద్ద ఉంటున్న శకుంతలబాయి, తన బాగోగులు చూడని కుమారులు తన ఇంట్లో ఉండవద్దని, ఇల్లును తనకు స్వాధీనం చేయాలని 2024 ఫిబ్రవరిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆర్డీవోను ఆశ్రయించింది. అధికారులు ఇద్దరు కుమారులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంటిని తమ తల్లికి అప్పగిస్తామని అంగీకరించిన కుమారులు, ఇంటిని ఖాళీ చేయలేదు. పలుమార్లు నోటీసులు పంపించినా స్పందించకుండా, అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు.
మూడు రోజుల క్రితం ఆర్డీవో ఆదేశాల మేరకు సైదాబాద్ మండల తహసీల్దార్ జయశ్రీ మరోసారి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించినా స్పందించలేదు. గడువు ముగిసినా ఇల్లును ఖాళీ చేయకపోగా, ఇంటికి తాళాలు వేసి జాడ లేకుండా వెళ్లిపోయారు. దీంతో గురువారం తహసీల్దార్ జయశ్రీ రెవెన్యూ ఇబ్బందితో కలిసి ఇంటిని సీజ్ చేసుకుని, శకుంతలబాయికి అప్పగించారు.