CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సోనియాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తాం. లక్షల మంది రాజీవ్‌గాంధీ అభిమానుల మధ్య విగ్రహావిష్కరణ జరుగుతుంది’.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ నిర్వహించిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ సోమవారం సమయం, సందర్భం లేకుండా తూతూమంత్రంగా, హడావుడిగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ‘గాంధీ’ కుటుంబం మొత్తం ముఖం చాటేసింది. రాహుల్, సోనియా, ప్రియాంక.. ఇలా ఆ కుటుంబ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా అభినందనలు తెలపలేదు. దీంతో ఈ విషయమై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డిని గాంధీ కుటుంబం దూరం పెట్టిందన్నది వట్టి ప్రచారం కాదని.. నిజమేనని ఈ ఘటనతో రుజువయ్యిందని అంటున్నారు. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో జరిగిన రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు. కానీ తెలంగాణకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. చివరికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తప్ప ఏఐసీసీ నుంచి ప్రతినిధులు కూడా హాజరు కాలేదంటున్నారు. దీనినిబట్టి రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణను ఢిల్లీ పెద్దలు లైట్ తీసుకున్నారని అర్థమవుతున్నదని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి గత తొమ్మిది నెలల్లో 21సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు రావాలని ప్రత్యేకంగా నాలుగైదు సార్లు రాహుల్‌గాంధీని, సోనియాగాంధీని ఆహ్వానించారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సీఎం పలుమార్లు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కూడా ఈ విషయాన్ని చెప్పారు. కానీ వారు ఎప్పుడూ సానుకూలంగా స్పందించలేదన్న ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి సచివాలయం ముందు విగ్రహం ఏర్పాటుపై ఢిల్లీ పెద్దలు మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకోసం గుర్తించిన స్థలంలో రాజీవ్ విగ్రహం పెడుతుండటంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయని, పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపించాయని, దీంతో ప్రజల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా వెళ్తున్నామనే భావన వారిలో ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. దీనికితోడు పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలం కావడంతో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని అంటున్నారు. అందువల్లనే విగ్రహావిష్కరణకు పిలిచినా సోనియా, రాహుల్, ప్రియాక రాలేదని చెప్తున్నారు.
ఢిల్లీతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీనికి రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణను వేదికగా చేసుకుందామని భావించారని అంటున్నారు. ఆగస్టు 20న రాజీవ్‌గాంధీ జయంతి. అప్పటికే విగ్రహం పనులు పూర్తయ్యాయి. కానీ బూమరాంగ్ అయ్యిందని చర్చ జరుగుతున్నది. తాను పిలిచినా ఢిల్లీ పెద్దలు వచ్చే అవకాశం లేకపోవడం, విగ్రహావిష్కరణతో కొత్తగా వచ్చే మైలేజీ లేకపోవడం..
పైగా వేరే రోజుల్లో విగ్రహావిష్కరణ జరిపితే గాంధీ కుటుంబం ఎందుకు రాలేదన్న ప్రశ్నలు ఎదురవుతాయన్న ప్రశ్నల నేపథ్యంలో సోమవారాన్ని ఎంపిక చేసుకున్నట్టు చర్చ జరుగుతున్నది. సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ జరుపుకొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం, మంగళవారం వినాయక నిమజ్జనాల హడావుడి ఉంటుంది. వరుసగా నాలుగు రోజులుగా సెలవులు రావడంతో ప్రజల దృష్టి ప్రభుత్వంపై లేదు. ఈ సందర్భంలోనే సందట్లో సడేమియా మాదిరిగా విగ్రహావిష్కరణ చేశారని చెప్పుకుంటున్నారు.