పటాన్చెరు, జనవరి 3: భార్యను కాపురానికి పంపడంలేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను హత్య చేశాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోయగా దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన సాయిబాబాకు సత్యవతితో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సత్యవతి ఇస్నాపూర్‌లోని పద్మరావునగర్లోగల పుట్టింటికి వెళ్లింది. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పెద్దలు పంచాయితీ నిర్వహించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అయినా సత్యవతి కాపురానికి రాకపోవడంతో సాయిబాబా ఆగ్రహం తో రగిలిపోయాడు.
బుధవారం రాత్రి ఇస్నాపూర్ వచ్చి కత్తితో అత్తపై దాడికి దిగాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోశాడు. అత్త ఘట నా స్థలంలోనే మృతి చెందింది. భార్య సత్యవతి బయటకు పరిగెత్తడంతో స్థానికులు గ్రహించి సాయిబాబా వెంటపడ్డారు. నిందితుడు పరారై పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన సత్యవతిని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పటాన్చెరు సీఐ లాలూనాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.