Mulugu | ములుగు, మే 16 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన కొడుకు మృతి చెందగా, పాడె మోసేందుకు నలుగురు లేక, ఖననం చేసేందుకు తల్లి చేతిలో చిల్లిగవ్వ లేక, పిడికెడు పూలను కొడుకు శవం మీద చల్లి చేతులెత్తి మొక్కి పంచాయతీ సిబ్బందితో కాటికి సా గనంపింది. ఈ హృదయ విదారక ఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన లచ్చమ్మ ఒక్కగానొక్క కొడుకు రాజు (20) ఈనెల 14 తెల్లవారుజామున చేతి మణికట్టు వద్ద కత్తితో కోసుకున్నాడు. గాయపడిన రా జును తల్లి లచ్చమ్మ ములుగు దవాఖానకు తీసుకొచ్చింది. వైద్యులు ప్రథమ చికిత్స చేయగా, కడుపు నొప్పి ఉందంటూ రాజు దవాఖానలోనే ఉన్నాడు.
పని చూసుకొని తిరిగి వస్తానని తల్లి కొడుకును దవాఖానలోనే ఉంచి మల్లంపల్లికి వెళ్లింది. కొడుకు చనిపోయినట్టు సమాచారం రావడంతో పరుగున దవాఖానకు చేరుకున్నది. కొడుకు తలపగిలి చనిపోయి కనిపించాడు. కొడుకు ఎందుకు చనిపోయాడో తెలియని తల్లి గుండెలవిసేలా రోదించింది. కింద జారిపడి చనిపోయాడని దవాఖాన సిబ్బంది ఆమెకు తెలిపి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. గురువారం పోలీసులు విచారణ చేపట్టి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లికి అప్పగించే ప్రయత్నం చేశారు.
కొడుకు మృతదేహాన్ని ఇంటి వరకు తీసుకెళ్లేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతోపాటు మల్లంపల్లిలో సొంత ఇల్లు కూడా లేదని రోదించింది. దీంతో పోలీసులు తల్లి నిర్ణయం మేరకు గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. ములుగు పంచాయతీకి చెందిన జేసీబీ ముందు డోజర్‌లో రాజు మృతదేహాన్ని తీసుకెళ్తుండగా, బరువెక్కిన హృదయంతో తల్లి పిడికెడు పూలను కొడుకు మృతదేహంపై చల్లి ఏడుస్తూ సాగనంపింది.
ఈ విషయమై సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. దవాఖాన ఆవరణలో జారి ప డడంతో గాయమై చనిపోయాడని తెలిపారు.
తన కొడుకు దవాఖానలో జారిపడటం తో నెత్తికి దెబ్బతాకి చనిపోయినట్టు సిబ్బంది చెప్తున్నారని, ఎస్సై సారు, దవాఖాన పెద్దసారు సీసీ కెమెరాలు చూస్తే అందులో రాజు దవాఖాన పైనుంచి దూకి చనిపోయినట్టు ఉన్నదని తల్లి లచ్చమ్మ తెలిపింది. పెద్దసార్లు ఎందుకు అబద్ధం ఆడుతున్నారో తెలుస్తలేదని ఆమె విలపించింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.