నిడమనూరు, ఆగస్టు 25: మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి తల్లి గొంతు కోసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరులో ఆదివారం వెలుగుచూసింది. పో లీసులు కథనం ప్రకారం.. రావిరాల శివకుమార్(36) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి అక్క కూతురితో వివాహమైంది. ఆ తరువాత అతడు భార్యతో తరచూ గొడవ పడేవాడు. మూడు నెలల క్రితం పంచాయితీ పెట్టి విడాకులు తీసుకున్నారు.
ఈ ఘటన తర్వాత మద్యానికి డబ్బులివ్వాలంటూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. శనివారం రాత్రి కూడా తల్లిని డబ్బులివ్వాలని కోరగా లేవని చెప్పింది. ఆమెపై మరింత కోపం పెంచుకున్నాడు. బయటకు వెళ్లి మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే మం చంపై నిద్రిస్తున్న తల్లి గొంతును కూరగాయల కత్తితో కోశాడు. ఆమె ప్రాణాలు విడవగానే.. అదే కత్తితో శివకుమార్ తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.