హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, బిల్లుల చెల్లింపుల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్న ఆ శాఖలో తాజాగా వైద్యుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పేరిట జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. రిటైర్మెంట్ వయసును 61 నుంచి 65 ఏండ్లకు పెంచుతామంటూ 100 మంది డాక్టర్ల నుంచి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.3 కోట్ల వసూళ్లకు పాల్పడ్డ బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. వైద్యశాఖలోని ఓ కీలక విభాగం అధిపతి భార్య ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్టు ఆరోపణలున్నాయి. ఆ శాఖలో డిప్యుటేషన్‌పై వచ్చి పాతుకుపోయిన ఓ కింది స్థాయి అధికారి ఈ వసూళ్ల దందాను ముందుండి నడిపినట్టు తెలుస్తున్నది.
డీఎంఈ పరిధిలో టీచింగ్ స్టాఫ్ 65 ఏండ్లకు, నాన్-టీచింగ్ స్టాఫ్ 61 ఏండ్లకు రిటైర్ అవుతారు. ఈ విభాగం మాదిరిగానే తమ విభాగంలో సైతం రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లకు పెంచుతామని డాక్టర్లకు కీలక విభాగాధిపతి భార్య ఎర వేసినట్టు సమాచారం. రిటైర్మెంట్ వయసు పెంపునకు స్వయంగా ఆమె హామీ ఇవ్వడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా గుడ్డిగా నమ్మిన 100 మంది డాక్టర్లు ఆమె అడిగినంత ముట్టజెప్పినట్టు తెలిసింది. సాధారణంగా క్యాబినెట్ అప్రూవల్, గవర్నర్ ఆమోదం, జీవో ఉంటేనే రిటైర్మెంట్ వయసు పెంపు జరుగుతుంది. కానీ, వైద్యారోగ్య శాఖ పెద్దలంతా తన భర్త కనుసన్నల్లో ఉన్నారని, ప్రభుత్వంతో మాట్లాడి జీవో జారీ అయ్యేలా చేస్తానని వైద్యులను కీలక విభాగాధిపతి సతీమణి బురిడీ కొట్టించినట్టు తెలుస్తున్నది.
సీఎంవోను మేనేజ్ చేయొచ్చంటూ..
నిరుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ అక్రమ వసూళ్ల తంతు నడిచినట్టు సమాచారం. దీనిలో భాగంగా ఆ డాక్టర్లు వాట్సాప్‌లో ఓ గ్రూపును పెట్టుకుని, తాము ఎంత ముట్టజెప్పాలన్నదానిపై చర్చించుకున్నట్టు తెలిసింది. వారు వసూలు చేసిన డబ్బులన్నింటినీ పోగుచేసి సీఎంవోకు ఇస్తే పని అయిపోతుందని కీలక విభాగాధిపతి సతీమణి చెప్పినట్టు తెలిసింది. సదరు కీలక విభాగాధిపతి భార్యతోపాటు ఆ 100 మంది వైద్యులు నిరుడు డిసెంబర్ 31న ఉద్యోగ విమరణ పొందారు. వారి రిటైర్మెంట్ వయసును పొడిగించకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. వారిలో గట్టిగా గొడవ చేస్తున్న ఇద్దరు ముగ్గురు వైద్యులకు కీలక విభాగాధిపతి భార్య ఎంతో కొంత ముట్టజెప్పి, మిగతా వారికి ఇవ్వకుండా ముఖం చాటేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆమె వైద్యారోగ్య శాఖ పెద్దలకు కూడా కొంత డబ్బు ముట్టజెప్పినట్టు సమాచారం. ఆమె భర్త సైతం మరి కొన్ని రోజుల్లో రిటైర్ కానుండటంతో ఇదే అదునుగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఆయన భార్యకు డబ్బులు చెల్లించిన బాధిత వైద్యులంతా ప్రస్తుతం ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.