హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : కొందరు డాక్టర్లు బదిలీల నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపులు పొందారంటూ ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బాబురావు ఆరోపించారు. మంగళవారం ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ బొంగు రమేశ్, డాక్టర్ లాలుప్రసాద్ తదితరులు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీజీడీఏ)ఆఫీస్ బేరర్లుగా చెప్పుకొని బదిలీల నుంచి మినహాయింపు పొందారని పేర్కొన్నారు.
పల్లం ప్రవీణ్ 19ఏండ్లుగా, బొంగు రమేశ్ 17ఏండ్లుగా, లాలుప్రసాద్ 12ఏండ్లుగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని చెప్పారు. వారు 2016-18 మధ్య ఆఫీస్ బేరర్లుగా పనిచేశారని తెలిపారు. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 80 ప్రకారం ఆఫీస్ బేరర్లకు గరిష్ఠంగా ఆరేండ్ల మినహాయింపు మాత్రమే ఉంటుందని గుర్తుచేశారు. కానీ, వారు అంతకుమించి ఒకే కేంద్రంలో పనిచేస్తున్నందున మినహాయింపులకు అర్హులు కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
40 కోట్లకు బ్యాంకు సిబ్బంది బురిడీ
జూబ్లీహిల్స్, జూలై 30: కంచే చేను మేసిన చందంగా మారింది ఆ బ్యాంక్ ఉద్యోగుల తీరు. శంషాబాద్ పరిధిలోని ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాంచి మేనేజర్ కే రామస్వామి, సర్వీస్ డెలివరీ మేనేజర్ ఎస్ రాజేశ్ ఏకంగా రూ.40 కోట్ల సొమ్మును దారి మళ్లించేందుకు సహకరించారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసుల కథనం ప్రకారం.. జూలై 12న సదరు బ్యాంక్ ఉద్యోగులు ఒక వినియోగదారుడితో అనధికార లావాదేవీలు నిర్వహించి ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఖాతా నుంచి పలు ఖాతాలకు పెద్ద మొత్తాలను బదిలీ చేశారు. రామస్వామి, రాజేశ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు కేసులో కీలక పాత్రధారిగా ఉన్న షేక్ బషీద్‌ను సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేశారు.