హైదరాబాద్, జనవరి 15 (నమస్తేతెలంగాణ): ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాము వేసిన క్వాష్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నామని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్చార్జి సోమా భరత్‌కుమార్ చెప్పారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందనే వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణభవన్‌లో లీగల్‌సెల్ ప్రతినిధులు కల్యాణ్‌రావు, లలితారెడ్డితో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వార్తను కొన్ని మీడియా చానెల్స్ వక్రీకరించడం దురదృష్టకరమని మండిపడ్డారు.
ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా ఈ-రేస్‌ను హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు బీఆర్ఎస్ హయాంలో నిర్వహించినట్టు చెప్పారు. ఇందులో అవినీతి జరిగిందని కేటీఆర్‌పై ఈ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ కేసు విచారణకు కేటీఆర్ సహకరిస్తున్నారని తెలిపారు. తమ లీగల్ టీం ఒపీనియన్ ప్రకారం సుప్రీంకోర్టులో బుధవారం కేసును విత్‌డ్రా చేసుకున్నామని, కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని స్పష్టంచేశారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉన్నదని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు అర్ధసత్యాలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లి తమపై ఉన్న ఎఫ్ఐఆర్ రద్దుచేయాలని కోరారని, క్వాష్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారని గుర్తుచేశారు. వాళ్లు చేస్తే కొట్టేయనట్టు, కేటీఆర్ చేస్తేనేమో కొట్టేసినట్టుగా అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ప్రజలకు ఉన్న ఏకైక మాధ్యమం మీడియా.. దానిని కూడా కాంగ్రెస్ నేతలు గబ్బుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు విషయాల్లో కూడా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం సరికాదని సూచించారు.