హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై మరో కేసు నమోదైంది. సోం డిస్టిలరీ అండ్ బ్రూవరీ కంపెనీపై చేసిన ఆరోపణలపై భోపాల్ కోర్టు నుంచి క్రిశాంక్‌కు నోటీసులు పంపించారు. ఈనెల 18న భోపాల్‌లోని కోర్టుకు హాజరు కావాలని పంపిన నోటీసులు ఆలస్యంగా ఈ నెల 21న అందాయని క్రిశాంక్ ఎక్స్ వేదికగా గురువారం వెల్లడించారు. తాను చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా సోం డిస్టిలరీ కంపెనీతో తనపై కేసు వేయించిందని క్రిశాంక్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సోం డిస్టిలరీ కంపెనీ రూ.575 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిందని గత మేలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆ బీరు కంపెనీతో తెలంగాణను కూడా లూటీ చేయడానికి దానిని ఇక్కడికి తీసుకొస్తున్నారా? అని క్రిశాంక్ నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ సర్కారు కత్తిగట్టింది.
ఆధారాలు లేని కేసులను మోపి ఇరుకున పెట్టాలని చూస్తున్నది. ఇలా కాంగ్రెస్ 11 నెలల పాలనాకాలంలో నెలకొకటి చొప్పున 11 కేసులు ఆయనపై మోపింది. అన్ని కేసుల్లోనూ ప్రభుత్వం అభాసుపాలవుతున్నా, మరో కేసులో టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. తప్పుడు కేసుల్లో క్రిశాంక్‌ను బలవంతంగా ఇరికించేందుకు ప్రభుత్వం, పోలీసులు తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. గత మే నెలలో ఓయూ పీఎస్‌లో నమోదైన ఓ కేసులో చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ రానీయకుండా అదేనెల 9 వరకు వివిధ స్టేషన్లు, కోర్టులు తిప్పుతూ ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ ఆయనను విడుదల చేయలేదు.
11 నెలల్లో క్రిశాంక్‌పై నమోదైన 11 కేసులు