హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి ఏండ్లుగా ఉన్న చిక్కుముడులు ధరణి పోర్టల్ వేదికగా పరిష్కారం అవుతున్నాయి. భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్లో ఉన్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సర్వే నంబర్లు కనిపించకపోవడం, పొరబాటున నిషేధిత జాబితాలో కనిపించడం, విస్తీర్ణం తక్కువగా నమోదుకావడం వంటి సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘గ్రీవెన్స్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్’కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అధికారులు వాటిని నిశితంగా పరిశీలించి పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం పోర్టల్లో 28 ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్, 14 ఇన్పర్మేషన్ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి.