హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): గిరిజనులు ఎదుర్కొంటున్న పోడుభూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. పోడుభూములకు సైతం రైతుబంధును అమలుచేస్తున్నామని గుర్తుచేశారు. సోమవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌భవన్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజన సంక్షేమంలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు మార్గదర్శిగా నిలుస్తున్నదని చెప్పారు. అడవిబిడ్డలు అన్ని రంగాల్లో పురోగమించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. గిరిజన గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేయడం, ఆదివాసీ ప్రాం తాల్లో త్రీ ఫేజ్ విద్యుత్తు కోసం రూ.220 కోట్లు విడుదలచేసిన ఘనతలు సీఎం కేసీఆర్‌కే దక్కుతాయని చెప్పారు. దేశంలోఎక్కడాలేని విధంగా గిరిపోషణ్ కార్యక్రమం ద్వారా అడవిబిడ్డలకు బలవర్ధకమైన పౌష్ఠికాహారం అందజేస్తున్నామన్నారు.
అన్ని రంగాల్లో ఆదివాసీల పురోగమనం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు, దళితులు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు అన్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో గిరిజన బిడ్డలు సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. ఆదివాసీల భాష, వస్త్రధారణ, సంసృతిని పరిరక్షించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అన్నారు. రాష్ట్రంలో ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేస్తే మన బిడ్డలు ఒలంపిక్స్‌లో పతకాలు సాధిస్తారని చెప్పారు. పట్టణ జీవన సంస్కృతి కంటే ఆదివాసీ జీవన విధానం, సంస్కృతి గొప్పగా ఉంటుందని ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ మీరాజ్ పేర్కొన్నారు. సీఎంఎస్టీఈ పథకం కింద ఎంతోమంది గిరిజనులు పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని, ఈ ఏడాదికి రెండొందల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు వివరించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్ నికోలస్, సంయుక్త సంచాలకులు సముజ్వల, కల్యాణ్‌రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మీప్రసాద్, గిరిజన మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ సత్యనారాయణ, జీసీసీ జీఎం సీతారాంనాయక్, చీఫ్ ఇంజనీర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పలువురికి సన్మానం
ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన పలువురిని సన్మానించారు. సీఎంఎస్టీఈ పథకం పది మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.4.4 కోట్ల చెక్కులు అందజేశారు. దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు సాధించిన పది మంది ఆదివాసీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. వీటిని మొత్తం 183 మంది గురుకుల విద్యార్థులకు అందజేయనున్నారు.