నిజామాబాద్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ సాధించి తన సొంత గడ్డ నిజామాబాద్ నగరానికి గురువారం తొలిసారిగా అడుగుపెట్టిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఆమెను ఘనంగా సన్మానించారు.
ముందుగా ఫులాంగ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ మీదుగా ఖలీల్ వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నిఖత్ జరీన్ టాప్ లెస్ జీపులో ప్రధాన మార్గం గుండా తాను సాధించిన ప్రపంచ చాంపియన్ షిప్ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగగా.. వివిధ క్రీడా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాభిమానులు మువ్వన్నెల జెండాలు చేతబూని బైక్ లపై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
నిఖత్ జరీన్ రాకతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. న్యూ అంబేద్కర్ భవన్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ అమీర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, నగర మేయర్ నీతూకిరణ్ తదితరులు నిఖత్‌కు ఘన స్వాగతం పలికారు.
మంత్రి వేముల నిఖత్‌కు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని, ఆమెకు బాక్సింగ్‌లో ఓనమాలు నేర్పించిన తొలి గురువు కోచ్ సంసాముద్దీన్కు యాభై వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల కూడా నిఖత్‌కు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని అందించగా, ఎమ్మెల్యే షకీల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ నియోజగవర్గంలో నిఖత్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంటి స్థలం కేటాయిస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా సన్మాన సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ క్రీడా పటంలో నిఖత్ జరీన్ భారతదేశం పేరునే కాకుండా తెలంగాణ ప్రతిష్టను నిలిపిందన్నారు. ప్రపంచ చాంపియన్ గా సాధించిన విజయం ఎంతో అద్భుతమైన ఘట్టమని కొనియాడారు.
నిజామాబాద్ బిడ్డ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ కావడం మన అందరికి గర్వ కారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ క్రీడా రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. నిఖత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు.
నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు వచ్చిన తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. అందరి దీవెనలతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని తెలిపారు.