హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విజయ డెయిరీ, చిల్లింగ్ సెంటర్లలో సౌర విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 డెయిరీలను, 11 చిల్లింగ్ సెంటర్లను నిర్వహిస్తుంది. విద్యుత్ ఛార్జీల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీల వ్యయాన్ని తగ్గించే దృష్ట్యా, డెయిరీలలో సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని పదో బోర్డు సమావేశంలో నిర్ణయించింది.
ఈ మేరకు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, విజయ తెలంగాణ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ నీలం జానయ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లోని ప్రధాన డెయిరీతో పాటు జిల్లాల్లోని ఎనిమిది డెయిరీలు, చిల్లింగ్ సెంటర్లలో సౌర విద్యుత్ ప్లాంట్లను టీఎస్ రెడ్కో ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 1930 కేవీఏ.
సౌర విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్లోని ప్రధాన డెయిరీలో రూ. 36.75 లక్షల కరెంట్ బిల్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. జిల్లాల్లో రూ. 34.18 లక్షల బిల్లు ఆదా కానుంది. మొత్తంగా సంవత్సరానికి విజయ డెయిరీకి రూ. 71 లక్షలు ఆదా కానున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన డెయిరీలో సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చైర్మన్ లోక భూమారెడ్డి భూమిపూజ చేశారు.