హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని పెంచుకోవడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ అంశంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా తెలంగాణ స్థాయిని అందులేకపోతున్నది. 2022 డిసెంబర్ నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్రం తొలి త్రైమాసికానికే సాధించింది. దేశంలో విద్యుత్తు అంశాలను విశ్లేషించే ఎంబర్ ైక్లెమేట్ అనే సంస్థ రాష్ట్ర ఘనతను విస్పష్టంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యం పెంచుకుంటున్న రాష్ర్టాల సమాచారాన్ని ఎంబర్ ైక్లెమేట్ సంస్థ విశ్లేషించింది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలోనే అత్యంత వేగంగా తెలంగాణలో రెన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన విద్యుత్తు లాంటివి) పెరిగిందని తెలిపింది. 248 శాతం అధికంగా రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని తెలంగాణ సాధించినట్టు పేర్కొన్నది.
కేవలం మూడు రాష్ర్టాలే..
కేంద్రం నిర్దేశించిన రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం పెంపులో 2022 మార్చి నాటికి కేవలం మూడు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం 100 శాతం కంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించినట్టు ఆ సంస్థ నివేదికలో తెలిపింది. ఇందులో తెలంగాణ 248 శాతంతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నది. ఆ తరువాతి స్థానంలో 129 శాతంతో అండమాన్ నికోబార్, 119 శాతంతో రాజస్థాన్, 107 శాతంతో కర్ణాటక రాష్ర్టాలు ఉన్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యంలో దేశ సగటు 63 శాతం మాత్రమే. పెద్ద రాష్ర్టాలైన ఏపీ 50 శాతం, మహారాష్ట్ర 48 శాతం, పంజాబ్ 35 శాతం, మధ్యప్రదేశ్ 46 శాతం, పశ్చిమ బెంగాల్ 11 శాతం, బీహార్ 14 శాతం, ఉత్తరప్రదేశ్ 32 శాతం కాగా.. తెలంగాణ ఏకంగా 248 శాతాన్ని చేరుకోవడం గమనార్హం.
లక్ష్యం కన్నా 248 శాతం అధికం
దేశవ్యాప్తంగా 2022 చివరినాటికి 1,74,530 మెగావాట్ల (175 గిగావాట్లు) స్థాపిత సామర్థ్యాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ రంగం సాధించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ర్టాలవారీగా లక్ష్యాలను కూడా నిర్దేశించింది. 2022 మార్చి నాటికి 1,09,847.37 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే (63 శాతం) సాధించింది. తెలంగాణ విషయంలో 2,000 మెగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవాలని నిర్దేశించగా.. మార్చి నాటికే 4,959.19 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని (ఇన్స్టాల్డ్ కెపాసిటీ) సాధించి.. దేశంలోనే టాప్లో నిలిచింది. ఇది నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా 248 శాతం అత్యధికమని ఆ సంస్థ నివేదికలో పేర్కొంది. బీజేపీ పాలిత గుజరాత్లో 17,133 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని నిర్దేశించగా.. 16,587.9 మెగావాట్లు మాత్రమే సాధించింది. అదికూడా 100 శాతం కాదు. ఇలా ఏ రాష్ట్రం కూడా సాధించనంత వేగంగా తెలంగాణలో సామర్థ్యం పెరుగుతున్నదని సదరు సంస్థ విశ్లేషించింది.