ఖగోళంలో జరిగే అద్భుతం గ్రహణం. కాలగమనంలో ఇవి సహజంగా ఏర్పడుతుంటాయి. అయితే, పక్షం రోజుల నిడివిలో వరుసగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతుండటం ప్రస్తుత విశేషం. రెండు గ్రహణాలు పాక్షికమైనవే అయినప్పటికీ.. వరుసగా రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీపావళి మరుసటి రోజు అంటే అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం, కార్తిక పౌర్ణమి అంటే నవంబర్ 8వ తేదీన పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 25న ఏర్పడే సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగానే కనిపిస్తుంది. తెలుగు రాష్ర్టాల్లో సాయంత్రం 4-59 గంటలకు మొదలయ్యే గ్రహణం సాయంత్రం 5-45 వరకు 46 నిమిషాలపాటు కొనసాగుతుందని సిద్ధాంతులు పేర్కొన్నారు. గ్రహణాన్ని ప్రత్యేక ఫిల్టర్లతో చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట అమావాస్య పరివ్యాప్తమై ఉన్నందున సోమవారం నాడే దీపావళి పండుగ జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీపావళి సెలవును 25వ తేదీ నుంచి 24కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. ఇక కార్తిక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. చంద్రోదయం కన్నా ముందు గ్రహణం ఉండటం వల్ల దీన్ని చూసే అవకాశం ఉండదు. ఆ రోజు మధ్యాహ్నం 2-39 గంటల నుంచి సాయంత్రం 5-17 వరకు దాదాపు 2-38 గంటలపాటు గ్రహణం కొనసాగనుంది. ఏదేమైనా పదిహేను రోజుల వ్యత్యాసంలో రెండు గ్రహణాలు ఏర్పడుతుండటం ఆసక్తికర పరిణామం అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు.