హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ఒకరిని ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఓవైపు ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుండగానే ఇద్దరు బాహాబాహీకి దిగి తన్నుకున్నారు. మధ్యలో యాంకర్ ఎంత ఆపినా.. ఆగకుండా తిట్టుకుంటూ గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు. రాహుల్‌గాంధీ అన్ని ఎన్నికలు ఓడిపోతున్నారంటూ సోలంకి శ్రీనివాస్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది.
సోలంకిని మధ్యలోనే అడ్డుకున్న బల్మూరి వెంకట్ ‘ఏం మాట్లాడతరు.. తెలివి లేకుండా.. ఏం మాట్లాడుతున్నరు?’ అని అన్నారు. దీంతో సోలంకి.. ‘ఏయ్.. ఎవ్వరికి తెలివి లేదు. తెలివి ఏంది?’ అంటూ సీటులో నుంచి పైకి లేచారు. ‘ఏయ్.. ఏయ్ ఏంది?’ అని వెంకట్ ఇటు నుంచి.. అటు నుంచి సోలంకి అసభ్య పదజాలానికి దిగారు. దూషణలతో మొదలై ఇద్దరూ తన్నుకొనే వరకూ వెళ్లింది. యాంకర్, స్టూడియో సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా.. ఇద్దరూ నెమ్మదించలేదు. అప్పటికే లైవ్ చూస్తున్న కొందరు ప్రేక్షకులు ఆ విజువల్స్‌ను ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి.