మన్సూరాబాద్, జనవరి 20: మాంజా దారం తగిలి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నాగోల్ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ (37) హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా నాగోల్ ఫ్లైఓవర్ వద్ద తెగిపడి ఉన్న మాంజా దారం రాజశేఖర్ ముఖానికి చుట్టుకుంది. దీంతో ముక్కు పై భాగంలో కోసుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర రక్తస్రావం కావడంతో చొక్కా రక్తంతో తడిసిపోయింది. వెంటనే అతడిని వాహనదారులు అంబులెన్స్‌లో ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న రాజశేఖర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది. ఫ్లైఓవర్లు, ప్రధాన రహదారులపై తెగిపడి ఉన్న మాంజాలు ప్రాణాంతకంగా మారడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా నిషేధిత మాంజా విక్రయాలను జరుపుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.