హైదరాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన జే ఇషాన్, నేహా చిన్నతనంలోనే పెద్దమనసు చాటుకున్నారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో స్కిల్స్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది చిన్నారులను చూసి వారి కోసం ఏమైనా చేయాలని తలపోశారు. ప్రైవేటు స్కూల్లో తమలాంటి ఎంతోమంది స్కిల్స్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారి సంగతేంటని ఆలోచించారు.
దీంతో ఆ చిన్నారుల్లో ఓ ఆలోచన మొగ్గ తొడిగింది. అటువంటి వారికి సాఫ్ట్ స్కిల్స్ నేర్పించేందుకు ఓ ఫౌండేషన్‌ను ఎందుకు నెలకొల్ప కూడదని ఆలోచించారు. అలా పురుడు పోసుకున్నదే ‘ఆశయం’. ఈ ఎన్జీవోను ఇషాన్ తన స్నేహితురాలు నేహతో కలిసి స్థాపించాడు. 2022లో ఈ ఫౌండేషన్ స్థాపించినప్పుడు వారు చదువుతున్నది తొమ్మిదో తరగతి మాత్రమేనంటే ఆశ్చర్యం అనిపించకమానదు.
అప్పటి నుంచి ప్రతి శనివారం ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి వారిలో సాఫ్ట్ స్కిల్స్ పెంచడంలో సాయం చేస్తున్నారు. ఆటలు ఆడుతూ, వారితో మమేకమవుతూ అక్కడి చిన్నారులకు సాఫ్ట్‌స్కిల్స్ నేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది విద్యార్థులను టీచర్లను చూసి భయపడుతుంటారని, తాము వలంటీర్లుగా స్కూలుకు వెళ్లినప్పుడు తాము కూడా కోప్పడతామేమోనని విద్యార్థులు భయపడేవారని గుర్తుచేసుకున్నారు. దీనిని తాము మార్చాలనుకున్నట్టు చెప్పారు.
‘ఆశయం’ పాఠ్యపుస్తకాల ఆధారంగా పనిచేయదని, వారికి పాఠాలు చెప్పబోమని ఇషాన్ చెప్పుకొచ్చాడు. గేమ్స్ ద్వారా మాత్రమే తాము బోధిస్తామని చెప్పాడు. కమ్యూనికేషన్, అనుభవాలను పంచుకోవడం, టీం వర్క్, ఆత్మవిశ్వాసం పెంపొందించడం వంటి ఏడు ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తామని వివరించారు. ఉదాహరణకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పేందుకు చిన్ననాటి ఆట ‘చైనీస్ విష్పర్’ను ఎంచుకుంటామని చెప్పారు. వారు దీనిని ఎంతగానో ఇష్టపడతారని అన్నారు. వారికి దగ్గరుండి బోధించాలనుకోవడం కాకుండా సరైన దారిలో ఆటల ద్వారా నేర్పిస్తామని వివరించారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు తాము మాడ్యూల్స్ తయారు చేశామని చెప్పారు. గంట, గంటన్నరలో ఒకటి రెండు స్కిల్స్ పూర్తవుతాయన్నారు. సుదీర్ఘ ఉపన్యాసాల కంటే ఇటువంటివి తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు.
ఇషాన్, నేహ గత రెండేళ్లలో హైదరాబాద్‌లోని కోకాపేట, గండిపేట, మసీద్‌బండ, రా యదుర్గం, శేరిలింగంపల్లి, ఎల్లగండ్ల సహా హై దరాబాద్‌లోని దాదాపు అన్ని స్కూళ్లను కవర్ చేశారు. కరీంనగర్ మాడల్ స్కూల్లోనూ సెషన్స్ నిర్వహించారు. అంతేకాదు, వలంటీర్ల సాయంతో తెనాలి, పశ్చిమ బెంగాల్లోనూ సెషన్స్ నిర్వహించడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. వీరిద్దరూ తమ సొంత డబ్బులనే ఇందుకోసం ఖర్చు చేస్తుండటం.
కుటుంబ సభ్యులు కూడా వీరికి సాయం చేస్తుంటారు. ఇప్పుడు ‘ఆశయం’ పెద్ద ఆశయాన్నే పెట్టుకుంది. వచ్చే ఏడాది నుంచి మరింతమందిని ఎంచుకుని వలంటీర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యం గా పెట్టుకుంది. తద్వారా తమ లక్ష్యాన్ని మరింతగా విస్తరించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. పాఠశాల జీవితంలో ప్రతి ఒక్కరికీ సాఫ్ట్‌స్కిల్స్ అవసరమని ఇషాన్, నేహా చెప్పుకొచ్చారు. ‘ఆశయం’ ఒక ప్రాజెక్టు కాదని, అది ఒక మైండ్‌సెట్ అని వివరించారు. ఇషాన్ మరెవరో కాదు.. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమారుడే.