పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీంకు సంబంధించిన సొమ్మును ఉద్యోగుల సీపీఎస్ ఖాతాలో పది నెలలుగా జమ చేయడంలేదు. దీంతో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించిన ప్రభుత్వం.. ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. 10నెలలుగా సీపీఎస్ సొమ్ము ఎన్పీఎస్ ఖాతాలో జమకాకపోవడంతో దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోతున్నారు. దీంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం దారుణం కానున్నది. ఫైనాన్స్ ఆఫీసర్ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ఫండ్‌ను నష్టపోవాల్సి వస్తున్నది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అథారిటీ ప్రకారం ఈ కాంట్రిబ్యూటర్ పెన్షన్స్‌కు సంబంధించి ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్మును ఏ నెలకు ఆ నెల ఉద్యోగుల ఎన్పీఎస్ పీఆర్ఏఎన్ ఖాతాలో జమచేయాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యంగా జమచేస్తే దానికి తగిన వడ్డీ సహా జమ చేయాల్సి ఉంటుంది. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన 6 నెలలకు, 10 నెలలకోసారి జమచేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులు స్టాక్ మారెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని, వడ్డీని కోల్పోతున్నారు. ఇదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై ఫైనాన్స్ ఆఫీసర్ కిరణ్మయి వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త సెక్రటరీకి ఈ విషయాన్ని మొరపెట్టుకున్నప్పటికీ ఆయన పట్టించుకోవడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు.