న్యూఢిల్లీ, డిసెంబర్ 9: సోషల్ మీడియాపై గంటల తరబడి గడిపే పిల్లల్లో మానసిక ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు దెబ్బతింటున్నాయని, ఏకాగ్రత లోపిస్తున్నదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అమెరికా వ్యాప్తంగా పిల్లలపై జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌పై తరుచూ స్క్రోలింగ్, నోటిఫికేషన్లను చూస్తూ గడపటం.. పిల్లల్లో ‘ఏడీహెచ్‌డీ’ వంటి లక్షణాల్ని (చంచల స్వభావం, పనిపై శ్రద్ధ లేకుండుట) పెంచుతున్నదని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో సగటున ప్రతి పిల్లాడు టీవీ, ఆన్లైన్ వీడియోలపై రోజూ సగటున 2.3 గంటలు, సోషల్ మీడియా కోసం 1.4 గంటలు, వీడియో గేమ్స్‌పై 1.5 గంటలు గడుపుతున్నాడట. అయితే ఇందులో సోషల్ మీడియా ఒక్కటే పిల్లల ఏకాగ్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అన్ని రకాల ‘స్క్రీన్ టైమ్’ పిల్లలపై ఒకేవిధమైన ప్రభావం చూపటం లేదన్న విషయం వీరి పరిశోధనలో తేలింది. స్వీడన్‌కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, యూఎస్‌కు చెందిన ఒరేగావ్ హెల్త్, సైన్స్ వర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.