Sunkisala | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా సుంకిశాల వద్ద చేపట్టిన జలమండలి పనుల్లో ఒక్కసారిగా రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనపై ప్రభుత్వ వ్యవహార శైలి మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇంత పెద్ద ఘటన జరిగి నాలుగు నెలలైనా, వాస్తవాలను ప్రజల ముందు బహిర్గతం చేయకపోగా, దేశ భద్రతతో ముడిపెట్టి సమాచార విషయంలో గోప్యతను పాటిస్తున్నది. ఘటనకు కారణమైన మేఘా ఇంజినీరింగ్ కంపెనీపై చర్యలు తీసుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నది. జలమండలిలో ఐదుగురు ఇంజినీర్లపై చర్యలు తీసుకున్న సర్కారు… ఘటనకు తామే బాధ్యులమని ఏజెన్సీ లిఖితపూర్వకంగా తెలిపినా చర్యల విషయంలో తాత్సారం చేస్తున్నది. రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనను గోప్యంగా ఉంచినట్టే.. నిర్మాణ కంపెనీ మేఘాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదో చెప్పకుండా దాచేస్తున్నారు. ఈ ఘటనపై విజిలెన్స్ విచారణ జరిపిన ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం లేదు. రిటెయినింగ్ వాల్ కూలడానికి కారణమైన నిర్మాణ కంపెనీ మేఘాపై తీసుకున్న చర్యలపై విజిలెన్స్ విచారణ నివేదిక ఇవ్వాలంటూ సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ఆర్టీఐ చట్టం ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగాన్ని కోరారు. 2024 నవంబర్ 12న ఆయన నివేదిక ఇవ్వాలని కోరగా గురువారం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్-8 ప్రకారం నివేదిక ఇవ్వలేమని ఎంఏయూడీ నుంచి లేఖ రూపంలో సమాధానం పంపించారు.
దేశ భద్రతతో ముడిపెట్టి ఈ సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యత పాటించడం విస్మయానికి గురిచేస్తున్నది. వాస్తవానికి, నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో అంచనా వేయలేకపోయామని, తద్వారానే రిటెయినింగ్ వాల్ కుప్పకూలిందంటూ నిర్మాణ సంస్థ మేఘా తన తప్పిదాన్ని అంగీకరించింది. జలమండలి గతంలో ఇచ్చిన నోటీసుకు ఇచ్చిన సమాధానంలో ఇదే విషయాన్ని ఒప్పుకున్నది. తమ సొంత ఖర్చుతో వాటిని పునరుద్ధరిస్తామని తెలిపింది. మేఘా తన తప్పును అంగీకరించినందున ఆ సంస్థ సొంత ఖర్చుతోనే మరమ్మతు పనులు చేయాల్సి ఉంటుంది. కానీ, మరికొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చి హైదరాబాద్ తాగునీటి సరఫరాకు శాశ్వత భరోసాను కల్పించే సుంకిశాల పథకం ఈ తప్పిదంతో అందుబాటులోకి రాకుండాపోయింది. ఎప్పుడో అందుబాటులోకి వస్తుందో అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి. మేఘా తన తప్పిదాన్ని అంగీకరించిన దరిమిలా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. అధికారులపై చర్యలు తీసుకొని, మేఘాను వదిలివేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కనీసం విచారణ కమిటీ నివేదిక, తీసుకున్న చర్యలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన జలమండలి దీనిపై గోప్యత పాటించడం అనుమానాలకు తావిస్తున్నది.
సెక్షన్ 8 ఏం చెప్తున్నది?
సమాచార హక్కు చట్టం ద్వారా సుంకిశాల ఘటనపై విజిలెన్స్ విచారణ నివేదిక ఇవ్వాలని కోరితే, ఈ ఘటన సెక్షన్-8 కిందకు వస్తుందని, సమాచారం ఇవ్వలేమని ఎంఏయూడీ తెలిపింది. కానీ, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్-8 ప్రకారం.. భారతదేశ రక్షణ వ్యవహారాలు, దేశ భద్రతకు విఘాతం కలిగించే సమాచారం, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రతికూల ప్రభావం చూపే సమాచారం ఇవ్వకూడదు. వ్యూహాత్మక, ఆర్థిక, వైజ్ఞానిక, విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే సమాచారం బయటకు చెప్పకూడదు. ఏదైనా సమాచారం బయటకు చెప్పకూడదని కోర్టు ఆదేశిస్తే, ఆ సమాచారం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనుకుంటే బయటకు చెప్పకూడదు. కానీ, సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనలో నిర్మాణ సంస్థ వైఫల్యం ఉన్నది. దానిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రజల సొమ్ముతో కడుతున్నదే. ఈ ఘటనకు సమాచార హక్కు చట్టంలోని సెక్షన్- 8 వర్తించదని నిపుణులు చెప్తున్నారు.
సమాచార కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాం: గవినోళ్ల శ్రీనివాస్
సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనపై విచారణ.. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్- 8 కిందకు రాదని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. అధికారంలోకి రాగానే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామన్నరు. మేఘా కంపెనీ తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరి, నేడు సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలడానికి కారణమైన మేఘా కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే సమాచారం ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? మేఘా కృష్ణారెడ్డికి రేవంత్‌రెడ్డి అమ్ముడుపోయారా? లొంగిపోయారా?’ అని గవినోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. తాను అడిగిన సమాచారం ఎంఏయూడీ ఇవ్వకపోతే, మేఘా కంపెనీకి మద్దతిచ్చినట్టే అవుతుందని చెప్పారు. దీనిపై సమాచార కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. విజిలెన్స్ నివేదిక బహిర్గతమైతే. సీఎం రేవంత్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి మధ్య జరిగిన చీకటి ఒప్పందం వెలుగు చూస్తుందనే సమాచారం ఇవ్వడంలేదని ఆరోపించారు. విజిలెన్స్ నివేదికను బయటపెట్టి ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.