మంచిర్యాల టౌన్, జూన్ 23: రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తున్నది. పేదలు, చిరువ్యాపారులనే టార్గెట్ వారి నివాసాలను నేలమట్టం చేస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం పట్టణంలోని తిరుమల బుక్‌స్టాల్ నుంచి ఏవన్ హోటల్ వరకు సుమారు చిరువ్యాపారులకు చెందిన తాత్కాలిక షెడ్లను అధికారుల పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది నేలమట్టం చేశారు. కూల్చివేతలకు వ్యాపారులు అడ్డుతగులకుండా భారీస్థాయిలో పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఆక్రమణలను తొలగించామని పేర్కొన్నారు.
మంచిర్యాలలో దుర్మార్గపు పాలన: నడిపల్లి విజిత్‌రావు
జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్, మారెట్ ఏరియాలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రోద్బలంతోనే అధికారులు చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపల్లి విజిత్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిరువ్యాపారులకు చెందిన దుకాణాల కూల్చివేత ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గంలో దుర్మార్గమైన పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు పేదప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని, కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు. నిరుపేదలైన చిరువ్యాపారుల షెడ్లు కూలగొట్టడం బాధాకరమని వాపోయారు. నిరుడు రైల్వేస్టేషన్ సమీపంలోని 170 షాపులు తీసివేస్తామంటే అప్పటి ఎమ్మెల్యే దివాకర్‌రావు అధికారులతో మాట్లాడి ఒకషాపు కూడా తీసివేయకుండా చూశారని గుర్తుచేశారు. బాధితులకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేవరకు బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని తెలిపారు