Hyderabad | హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం (Rain) కురుస్తున్నది. ఎల్బీ నగర్, కొత్తాపేట, చైతన్యపురి, దిల్సుఖ్నగర్, మలక్పేట, నాంపల్లి, లక్డీకపూల్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అంబర్పేట, ఓయూ, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్ తదిరత ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది. నగరంలో ఆదివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగాయి.
రాగల మూడు రోజులు తెలంగాణలో (Telangana) వర్షాలు కురిసే అకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని తెలిపింది. వచ్చే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు, హైదరాబాద్ సమీప జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవనున్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ.. ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మంగళవారం నుంచి జూన్ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, పలుచోట్ల ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావ రణ శాఖ వివరించింది.