హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులను 2027 కల్లా పూర్తిచేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది. ఇప్పటికే సాంకేతికంగా అనేక సవాళ్లు ఎదురవుతుండగా, తాజాగా నిర్మాణ ఏజెన్సీల పరంగానూ సందిగ్ధత నెలకొన్నది. పనులను చేపట్టిన జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో దీర్ఘకాలంగా పనులు జాప్యానికి కారణమని తెలుస్తున్నది. తాజాగా ఆ కంపెనీని వేదాంత కంపెనీ కొనుగోలు చేసింది. ఆ కంపెనీపైనా ఇప్పటికే తీవ్ర రుణభారం ఉండగా, ప్రాజెక్టుల పూర్తికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రశ్నార్థకంగా మారాయి.
అనుకున్న మేరకు ఎస్ఎల్బీసీ పనుల కొనసాగింపు సాధ్యామా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ 44 కి.మీ. పొడవు. దానిని రెండు వైపులా నుంచి టీబీఎం టెక్నాలజీతో చేపట్టేందుకు జయప్రకాశ్ అసోసియేట్ కంపెనీ తొలుత పనులను చేజికించుకుంది. టీబీఎం టెక్నాలజీతో పనులను నిర్వహించిన అనుభవం, టెక్నాలజీ జేపీ అసోసియేట్స్‌కు సొంతంగా లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రాబిన్సన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. జాయింట్ వెంచర్‌గానే ఎస్ఎల్బీసీ పనులను 2005-06లో చేపట్టింది. అప్పటికీ కంపెనీ లాభాల్లోనే ఉన్నది. ఆదిలో పనులు సజావుగా కొనసాగాయి. టీబీఎంలు కొత్తవి కావడం, కంపెనీ సైతం లాభాల్లో ఉండటంతో టన్నెల్ పనులు వడివడిగా కొనసాగాయి. కానీ 2009 నాటికి జయప్రకాశ్ కంపెనీ నష్టాల్లోకి జారుకున్నది. ఇది మొదలు ఎస్ఎల్బీసీ పనులు మందకొడిగా సాగడం మొదలైంది. వాణిజ్యపరంగా నష్టాల్లోకి కూరుకుపోయిన జేపీ కంపెనీ ఎస్ఎల్బీసీ పనుల వేగాన్ని తగ్గించింది.
టీబీఎం విడిభాగాలను తెప్పించడంలో పూర్తిగా తాత్సారం చేస్తూ, పూటకో మాట చెప్తూ తప్పించుకుంటున్నది. ఇన్లెట్ టన్నెల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల గురించి ఇటీవల ప్రమాదం సంభవించేంత వరకూ రాబిన్సన్ కంపెనీ దృష్టికి జేపీ అసోసియేట్స్ తీసుకుపోలేదని అధికారులు వివరిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జేపీ కంపెనీ టీబీఎం యంత్ర విడిభాగాలను కూడా నాణ్యమైనవి తెప్పించడం లేదని, సెకండ్‌హ్యాండ్, నాసిరకం విడిభాగాలను దిగుమతి చేస్తున్నదని, అందువల్లే పదే పదే మరమ్మతులకు గురవుతున్నదని అధికారులే చెప్తున్నారు. అయినా కంపెనీ చెప్పిందే వేదం అన్నట్టుగా పరిస్థితి ఉంది. మొత్తంగా రెండు దశాబ్దాలు గడిచినా 44 కి.మీ. టన్నెల్ పూర్తికాలేదు. ప్రస్తుతం 9.6 కి.మీ. టన్నెల్ తవ్వాల్సి ఉన్నది.
నష్టాల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకు రుణాలను చెల్లించలేక జయప్రకాశ్ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ అమ్మకానికి సిద్ధపడింది. ఈ క్రమంలో బిడ్లను ఆహ్వానించింది. దీనికోసం రెండు ప్రధాన కంపెనీలు పోటీపడ్డాయి. అదానీ గ్రూప్ 12,100 కోట్లకు బిడ్‌ను దాఖలు చేయగా, వేదాంత కంపెనీ ఏకంగా 17,000 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. దీంతో జయప్రకాష్ కంపెనీని వేదాంత కంపెనీ స్వాధీనం చేసుకోవడం ఖరారైంది.
వేదాంత కంపెనీ ట్రాక్ రికార్డు సైతం ఏమంత గొప్పగా లేదని ఆర్థికవేత్తలే తేల్చారు. ఆ కంపెనీపై ఇప్పటికే రూ.57,185 కోట్ల రుణ భారం ఉన్నది. అదీగాక క్లిష్టమైన ప్రాజెక్టులను పూర్తిచేయడంలో వేదాంత కంపెనీ సైతం తడబడుతుందని చెప్తున్నారు. ఈ కంపెనీ ప్రధానంగా మైనింగ్ రంగంలో ఉన్నది. దీనికి సొరంగ తవ్వకంలో ఏమాత్రం అనుభవం లేదు. మరోవైపు ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్లో అత్యంత క్లిష్టతరమైన సమస్యలు ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి దాదాపు 400 మీటర్ల దిగువ నుంచి సొరంగం పనులను నిర్వహించాల్సి ఉన్నది. టన్నెల్లో భారీగా నీటి ఊట రావడం, షీర్ జోన్లు (పగులువారిన వదులైన రాతిపోరలు) తదితర అనేక క్లిష్టమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన ఈ సొరంగం పనులను వేదాంత కంపెనీ పూర్తి చేయగలదా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకు ఆ కంపెనీ గత ట్రాక్ రికార్డు చూస్తే అసాధ్యమని తెలుస్తున్నది. ఇప్పుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది.
జేపీ కంపెనీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ర్టావిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆ సంస్థకు వెసులుబాటు కల్పించింది. విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ఒప్పంద ధరల మార్పునకు తొలి సర్కారు అవకాశం కల్పించింది. అయినా కంపెనీ మాత్రం పనులను ముందుకు తీసుకుపోలేదు. పనుల గురించి అడిగిన ప్రతీసారి నిధుల లేమీ అంటూ చేతులేస్తున్నదని, దాంతో ప్రభుత్వం చెల్లించిన నిధులను కంపెనీ సొంతానికి వాడుకుంటూ, ఎప్పటికప్పుడు నష్టాలను పూడ్చుకోవడానికి వినియోగించింది. కానీ సొరంగం పనుల నిర్వహణకు వినియోగించింది తకువేనని తేలింది. ఒప్పందం చేసుకున్న రాబిన్సన్స్ కంపెనీకి సకాలంలో చెల్లింపులను చేయకపోవడం పరిపాటిగా మారింది. దీనిపై ఏవేవో సాకులు చూపుతూ పనులను ముందుకు తీసుకుపోవడం లేదని అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి.
ప్రమాదం వాటిల్లిన ఇన్లెట్ వైపునున్న టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది. సొరంగంలో ప్రమాదస్థలం అత్యంత దుర్లభమైన, సున్నితమైందని ప్రాంతమని, ఈ నేపథ్యంలో 50 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలను, మట్టి, రాళ్లను ఒకేసారి, ఒకేవైపు నుంచి కాకుండా దఫదఫాలుగా, ఇరువైపుల నుంచి కొద్దికొద్దిగా తొలగిస్తూ ముందు కు పోవాల్సి ఉంటుందని సబ్‌కమిటీ స్పష్టం చేసింది. టీబీఎం పద్ధతిలో సొ రంగం పనులను నిర్వహించడం అసాధ్యమని, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ టెక్నాలజీ ఒక్కటే శరణ్యమని, అందుకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచించారు. దీంతో మొత్తంగా ఇన్లెట్ పనులు ముందుకు కొనసాగడం అసాధ్యమని ఇరిగేషన్ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు.