Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): దగాపడ్డ తెలంగాణపై కాంగ్రెస్ పిడుగు. కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం. మట్టిపొరల కింద నాలుగు రాష్ర్టాలకు చెందిన 8 మంది కూలీలు.. నీటిజలమాటున వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో? యావత్‌దేశం ఉలిక్కిపడ్డది. కాంగ్రెస్ ఏలుబడిలో సాగునీటి ప్రాజెక్టుకు సొరంగముప్పునకు గురికావటం ఎస్ఎల్బీసీ రెండోది. 2011లో దేవాదుల సొరంగం కుప్పకూలి చలివాగు కింద ముగ్గురు జలసమాధి అయ్యారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికులు, సిబ్బంది సురక్షితంగా బయటకు రావాలని యావత్ ప్రపంచం ఆశిస్తున్నది.
వారి ప్రాణాలకు ఏ ప్రమాదం రాకూడదని తలపోస్తున్నది. ప్రమాదాన్ని మరో ప్రమాదంతో ముడిపెట్టకూడదు. కానీ, ఎస్ఎల్బీసీ సొరంగం పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన అత్యుత్సాహం, పదేండ్ల బీఆర్ఎస్ పాలనను అపహాస్యం చేయాలని కంకణం కట్టుకున్న వైనం చివరికి వారికే భస్మాసుర హస్తం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 42 కిలోమీటర్ల సొరంగాన్ని అభయారణ్యం మధ్య నుంచి ప్రాజెక్టు డిజైన్ చేయటమే అసలు కుట్ర. ఆ కుట్రకు సంపూర్ణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. సొరంగం పనుల్లో దశాబ్దాల జాప్యానికి… పనులు సాగకపోవటానికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నమూనాయే కారణమని సాగునీటిరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగితేనే కాంగ్రెస్ పార్టీ దాన్ని భూతద్దంలో పెట్టి నానా హంగామా చేసింది. మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయినట్టు బద్నాం చేసింది. ఇప్పటికీ కాళేశ్వరం పేరుతో రాజకీయాలు చేయటానికి బీఆర్ఎస్పై కాంగ్రెస్ కాలుదువ్వుతున్నది. అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తి కావస్తున్నా కావాలనే ప్రభుత్వం మేడిగడ్డకు మరమ్మతులు చేయటానికి ముందుకు రావటం లేదు.
కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని పడావుపెట్టి భూములను బీడు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతపెద్ద బరాజ్‌లో పిల్లర్లపై చిన్న పర్రె పడితే దాన్ని ప్రపంచ నష్టంగా చిత్రీకరంచిన కాంగ్రెస్ పార్టీ అక్కడికి రాహుల్‌గాంధీని తీసుకుపోయి నానా యాగీ చేసింది. కానీ, ఇప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, జార్ఖండ్ నుంచి నలుగురు, పంజాబ్, జమ్మూకశ్మీర్ నుంచి ఒకరు చొప్పున మొత్తం 8 మంది ఉన్నారు. వారి ప్రాణాలు ఊగిసలాడుతున్నాయి. ఈ పాపం ఎవరిది? ఆ ఎనిమిది మంది కుటుంబాల శాపం ఎవరికి తగులుతుంది?
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం ఉదయం 8.30 గంటలకు జరిగితే దాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాద తీవ్రత తెలిసినా ప్రభుత్వ పెద్దలు పెద్దగా స్పందించలేదని అధికారవర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. సొరంగంలో చిక్కుకున్నది ఉత్తరభారతానికి చెందినవారు కావడం, జాతీయ మీడియాలో విస్తృతంగా సొరంగ ప్రమాదం ప్రచారం కావటంతో అప్రమత్తమైన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినా పెద్దగా ఫలితం లేకుండాపోయిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా శాయంపేట మండలంలోని చలివాగు కింద దేవాదుల మూడో దశలో భాగంగా తవ్వుతున్న సొరంగ పనుల్లో ప్రమాదం సంభవించి ముగ్గురు కూలీలు జలసమాధి అయ్యారు. తెలంగాణ ఉద్యమ ధాటికి దేవాదులను పూర్తిచేస్తామని ఎటువంటి సాంకేతిక, ముందస్తు ఏర్పాట్లు లేకుండా సొరంగ ఉపరితలంపై చెరువు ఉందని తెలిసినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోవటం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నదని నిపుణులు అప్పట్లో తేల్చిచెప్పారు. ఇప్పుడూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎస్ఎల్బీసీని ఏమీ చేయలేదని తాము మాత్రమే చేస్తామనే గొప్పలకుపోయి పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే దుర్ఘటన చోటుచేసుకోవటం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.