ఎస్ఎల్బీసీ కుప్పకూలి ఏడాది దాటింది. ఇప్పటికీ సొరంగంలో సమాధి అయిన ఆరుగురి కార్మికుల మృతదేహాలను వెలికితీయలేదు. నిలిచిపోయిన పనులనూ ప్రారంభించలేదు. సర్కార్ సమీక్షలు.. నిపుణుల చర్చలు.. సర్వేలతోనే కాలం గడుస్తున్నది తప్ప ఒక్క అడుగూ ముందుకు పడిన దాఖలా లేదు. సొరంగం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. డీబీఎం పద్ధతిలోనూ సవాళ్లున్నాయని ఇంజినీర్లు నిర్ధారిస్తున్న విషయం. వెరసి పనుల పునఃప్రారంభంపైనా సర్వత్రా సందిగ్ధత నెలకొన్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఏకకాలంలో రెండు వైపుల నుంచి ఇన్లెట్ అంటే అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి, అవుట్ లెట్ అంటే మహబూబ్‌నగర్ జిల్లా మన్యవారిపల్లె నుంచి సొరంగం పనులు చేపట్టారు. ఇన్లెట్ సొరంగం 13.93 కి.మీ వద్ద 2025, ఫిబ్రవరి 21న కుప్పకూలింది. క్షేత్రస్థాయి అధ్యయనాలు, ప్రణాళిక లేకుండానే సర్కార్ హడావుడిగా ముందుకు పోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టమవుతున్నది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఆరుగురి జాడ తెలియలేదు. ప్రభుత్వ పెద్దలు అత్యాధునిక యంత్ర పరికరాలు, నేవీ, రెస్క్యూ దళాలను తెప్పిస్తున్నామని ప్రగల్భాలు పలికారు. తరువాత 200 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను కూడా తొలగించలేని దుస్థితి నెలకొన్నదంటూ సర్కార్ చేతులేత్తిసింది. ఏడాది గడిచినా మృతదేహాలను గుర్తించలేదు. రెస్క్యూ పనులను నిలిపివేసింది.
సొరంగం ప్రమాదంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) ధ్వంసమైంది. సర్కార్ అత్యుత్సాహం, కాంట్రాక్టర్ అనాలోచిత నిర్ణయంతో అవుట్‌లెట్‌లోని టీబీఎం పనికిరాకుండా పో యింది. బేరింగ్ పనిచేయకపోవడంతో టన్నెల్ పనులు నిలిచిపోయాయి. బేరింగ్, విడిభాగా లు దిగుమతికి కాంగ్రెస్ సర్కార్ కంపెనీకి రూ.100 కోట్లు చెల్లించింది. కంపెనీ కేవలం బేరింగ్ మాత్రమే తీసుకొచ్చి, విడిభాగాలు తేలేదు. సర్కార్ ఒత్తిడితో కంపెనీ ఔట్‌లెట్‌లోని టీబీఎంకు సంబంధించిన రింగ్గేర్, అడాప్టర్, వింగ్స్ వంటి విడిభాగాలను ఇన్లెట్ టీబీఎంకు అమర్చి, ఎలాంటి అధ్యయనాలు లేకుండానే ఇన్‌లెట్‌లో పనులు చేపట్టింది. రోజుల వ్యవధిలోనే టన్నెల్ కూలిపోయింది. కంపెనీ, సర్కార్ నిర్వాకం వల్ల ప్రస్తుతం అవుట్లెట్ టన్నెల్ వైపు పనులు ప్రారంభించలేని దుస్థితి నెలకొన్నది. తాజాగా మొత్తంగా టీబీఎం పద్ధతికే సర్కార్ స్వస్తి పలికింది.
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన, ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత 12 మందితో టెక్నికల్ కమిటీని, అనంతరం పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సిఫార్సులు చేసేందుకు సాంకేతిక నిపుణులతో ఆ కమిటీ మరో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ ఎస్ఎల్బీసీ పరిస్థితులపై, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనంచేసింది. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్సింగ్, టన్నెల్ స్పెషలిస్టు కల్నల్ పరీక్షిత్ పర్యవేక్షణలో ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) నేతృత్వంలో హెలిబోర్న్ మాగ్నటిక్ సర్వే నిర్వహించింది. భూమికి అడుగున 1000 మీటర్ల లోతు వరకు ఉన్న జియోలాజికల్ కండిషన్ డాటా సేకరించింది. ప్రభుత్వానికి నివేదిక అందిందని మంత్రి ఉత్తమ్ ప్రకటించగా.. అధికారులు మాత్రం నివేదిక తమకు అందలేదని తేల్చిచెప్తున్నారు. సర్వేకు నిధులు వెచ్చించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సర్వే నిర్వహించిన సంస్థ నివేదికను డిపార్ట్మెంట్కు, సంబంధిత సీఈకి అందించాల్సి ఉంటుంది. తాత్కాలికంగా సర్కార్ నియమించిన టన్నెల్ ఎక్స్‌పర్ట్‌కు నివేదిక అందివ్వడం ఇరిగేషన్వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సొరంగంలో ప్రమాద స్థలం అత్యంత దుర్లభమైన, సున్నితమైన ప్రాంతమని ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ స్పష్టం చేసింది. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ (డీబీఎం) టెక్నాలజీ ఒక్కటే శరణ్యమని సూచించింది. పనులు కొనసాగాలంటే ప్రమాద స్థలాన్ని తప్పిస్తూ, 300 మీటర్లు వెనక్కి వచ్చి అక్కడి నుంచి టన్నెల్ తవ్వుతూ అవుట్ లెట్ టన్నెల్‌కు కలుపాలని ప్రణాళికను సిద్ధం చేశారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇన్‌లెట్‌లో ఉన్న తరహాలోనే ఔట్లెట్ వైపునా షియర్ జోన్లు ఉన్నట్టు గుర్తించారు. ఔట్లెట్ నుంచి 21 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. కిలోమీటర్ దూరంలో టన్నెల్ కొండపై నల్లవాగు క్రాసింగ్ ఉన్నట్టు తేల్చారు. టన్నెల్ నుంచి 350 మీటర్ల ఎత్తులో క్రాసింగ్ వెళ్తున్నట్టుగా గుర్తించారు. ఇటీవల సర్వే సైతం నిర్ధారించినట్టు సమాచారం. టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆడిట్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగానికి ఇప్పటికీ ఆడిట్ పాయింట్ అనేది లేదు. ఉపరితలంలో దట్టమైన అమ్రాబాద్ పులుల అభయారణ్యం విస్తరించి ఉండటమే కారణం. ఆడిట్ పాయింట్ ఏర్పాటు చేసినా టన్నెల్ నుంచి మట్టి, రాళ్లు ఇతర శిథిలాలను బయటకు తరలించడం కూడా పెను సవాలేనని అధికారులు చెప్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ప్రకటనలు గుప్పించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకసారి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలుమార్లు ఎవరికి వారు సమీక్షలు పెట్టడం, ప్రచారం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏనాడూ దృష్టి సారించలేదు. అడుగడుగునా కాంగ్రెస్ నేతలు ప్రచారం, రాజకీయాలపైనే దృష్టి పెట్టారు తప్ప ప్రాజెక్టు రక్షణ చర్యలపై శ్రద్ధ పెట్టలేదు. వెరసి ప్రమాదం సంభవించింది. ఇప్పటికీ సర్కార్‌ది అదే తీరు. హెలిబోర్న్ సర్వే నిర్వహిస్తున్నామంటూ ప్రచారానికి తెరతీసింది. ఆర్భాటంగా నిపుణులను నియమించింది. పనుల కోసం ప్రత్యేకంగా ఇరిగేషన్ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించింది. సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నది. కానీ ఆచరణలో ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టతలేకుండా పోయింది.