హైదరాబాద్, మార్చి 3 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి ఎస్ఎల్బీసీ ఘటనలో కార్మికులు బలయ్యారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పది రోజులైనా సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందని మండిపడ్డారు. పదిరోజుల తర్వాత ప్రమాదస్థలికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ ఘటనతో సంబంధంలేని కేసీఆర్, హరీశ్‌రావుపై నిందలు మోపడం సిగ్గుచేటన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాను చదువుకున్న వనపర్తికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్ప ప్రాజెక్టు ప్రకటిస్తారనుకున్నామని, కానీ ఆయన రోజు మాదిరిగా కేసీఆర్‌ను దుర్భాషలాడడం, ఈ ఘటనకు ఆయనదే బాధ్యత అని మాట్లాడడం దుర్మార్గమన్నారు.
‘ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలానికి వెళ్లిన హరీశ్‌రావు బృందాన్ని అడ్డుకున్న ప్రభుత్వం.. బీజేపీ నేతలకు సాదరస్వాగతం పలికింది. ఈ వ్యవహారమే బీజేపీ, కాంగ్రెస్ మైత్రికి నిదర్శనం’ అంటూ శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఘటనకు ముందే దుబాయ్‌కు వెళ్లిన హరీశ్‌రావుపై అభాండాలు వేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలా? ప్రతిపక్షం చేపట్టాలా? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.3900 కోట్లు వెచ్చించి టన్నెల్ తవ్వకం పనులు చేపట్టిందని గుర్తుచేశారు. కానీ, నిపుణులను సంప్రదించకుండానే ప్రభుత్వం క్లిష్టమైన సొరంగం తవ్వకం మొదలు పెట్టిందని ఆరోపించారు. ఘటన జరిగి పదిరోజులైనా కార్మికులను గుర్తించలేదని మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో లాలూచీపడ్డారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. 15 నెలల్లో 37సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారని నిలదీశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన రోజే కార్మికులు మరణించినట్టు పేర్కొన్నారు. సహాయక చర్యల్లో విఫలమైన ప్రభుత్వం.. బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా సహాయక చర్యల్లో వేగం పెంచి కార్మికులను గుర్తించాలని డిమాండ్ చేశారు.