న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 1500 కో పెట్టుబడి పెట్టనుంది. సీజీఎంపీ ల్యాబ్తతోపాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నది. గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ కంపెనీ సుమారు రూ. 2300 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
మంత్రి కేటీఆర్‌తో సమావేశం తర్వాత స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్ సింగ్ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేశారు. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు సీఈవో అజయ్ సింగ్ వివరించారు. అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జెనెరిక్ ఔషధాల తయారీ, అనుమతులు పొందడానికి అవసరమైన క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత తమ కంపెనీకి ఉందన్నారు. హైడ్రాక్సీప్రోజెస్టెరాన్ 5 ఎం.ఎల్ జెనరిక్ ఔషధానికి సంబంధించిన అనుమతులను పొందడంతో పాటు అమెరికన్ మార్కెట్లో తొలిసారి ప్రవేశపెట్టింది తమ కంపెనీనే అని తెలిపారు.
స్లేబ్యాక్ ఫార్మా ప్రణాళికలు అద్భుతం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఫార్మారంగంలో స్లేబ్యాక్ ఫార్మా అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుని స్లేబ్యాక్ కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని అనేక లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ విజయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని కేటీఆర్ చెప్పారు.
సంక్లిష్టమైన జనరిక్, స్పెషాలిటీ ఔషధాల తయారీ, అభివృద్ధిలో స్లేబ్యాక్ ఫార్మాకు మంచి పేరుంది. 35 మంది సిబ్బందితో 2017లో హైదరాబాద్ లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. 2018 లో జీనోమ్ వ్యాలీలో పరిశోధన ల్యాబ్ (R&D lab) ప్రారంభంతో కంపెనీ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 3 యూనిట్లున్నాయి. 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్లే బ్యాక్ కంపెనీకి ఇంజెక్టబుల్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ ల్యాబ్, OSD ఫార్ములేషన్ డెవలప్మెంట్ ల్యాబ్, ఎనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్‌లున్నాయి.