హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. శుక్రవారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై శాసనమండలిలో సభ్యులు చర్చించిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు. యువత నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు వారిని ఆంత్రపెన్యూర్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
స్కిల్స్ యూనివర్సిటీలో 7వ తరగతి నుంచే అడ్మిషన్లు చేపడుతామని, షార్ట్‌టర్మ్ కోర్సుల కింద 30 నుంచి 45 రోజులు యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. స్కిల్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులతోసిలబస్ను రూపొందిస్తామని తెలిపారు. కులవృత్తులు, గ్రామీణ ప్రాంతాలవారికి అధిక ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.
వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత సాంకేతిక కోర్సులను ప్రవేశ పెడుతామని చెప్పారు. సెప్టెంబర్ నుంచే కార్యాచరణ ఉంటుందని తెలిపారు. 60 శాతం బోధన సిబ్బందిని వివిధ పరిశ్రమల నుంచి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. బోధనలో థియరీ, ప్రాక్టికల్స్ మధ్య ఉన్న తేడా తగ్గిస్తామని, అందుకోసం ఇంటర్న్‌షిప్‌లకు ఆహ్వానిస్తామని వివరించారు. యూనివర్సిటీ శిక్షణ సంస్థలను జిల్లాలకూ విస్తరిస్తామని, నిధుల సమీకరణకు ‘సెల్ఫ్ ఫైనాన్స్’ కోర్సులను రూపొందిస్తామని చెప్పారు. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
సిలబస్, కోర్సులు, అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని, సాఫ్ట్ స్కిల్స్ పై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ)తో శాసనమండలిని అనుసంధానిస్తామని చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం లభించిందని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు చైర్మన్ ప్రకటించారు.