ఎక్కడైనా అవినీతిని రూ.లక్షల్లో.. కోట్లల్లో చెప్పొచ్చు! కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా!! అవినీతిని పోల్చేందుకు పదాలు సరిపోవడం లేదు. ఎందుకంటే.. అవినీతికి కాదేదీ అనర్హం అనే తరహాలో అన్నిరంగాల్లోనూ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మినహాయింపు కాదని తాజాగా తేలింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివాదాస్పద భూముల కబ్జాలు, వాటాలు, కమీషన్లు చాలదన్నట్టు.. ఇప్పుడు ఏకంగా కేంద్ర పథకాన్ని సైతం సర్కార్ పెద్దలు రూ. వందల కోట్ల ఆదాయ మార్గంగా మలుచుకున్నారు.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. రాయదుర్గంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ‘యూనిటీ మాల్’! ఇందులో అవినీతి దందా పరిమాణం ఎంతో తెలుసా? ఏకంగా ఆకాశాన్ని తాకేలా నిర్మించే భవనమంత!. ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహిత రియల్ఎస్టేట్ సంస్థలు కలిసి గుట్టుగా సాగిస్తున్న ఈ దందాలో అత్యంత విలువైన భూములు హారతికర్పూరంలా కరిగిపోతుండగా, రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లనున్నది.
రాయదుర్గంలోని 6.13 ఎకరాల్లో పీఎం ఏక్తా పథకంలో భాగంగా యూనిటీ మాల్ ప్రాజెక్టును చేపట్టారు. మొత్తం 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం అందుబాటులోకి రానున్నది. ఇందులో 2.136 లక్షల చదరపు అడుగులను కేంద్రం తీసుకుంటుండగా.. 6.864 లక్షల చదరపు అడుగులు రాష్ట్ర ప్రభుత్వానికి లభించనున్నది. రూ.1,500 కోట్ల విలువైన భూమిని ఉచితంగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతున్నది మాత్రం 824 కోట్లు మాత్రమే! మధ్యలో డెవలపర్ల పంట పండనున్నది. వారు ఏకంగా 17.82 లక్షల చదరపు అడుగులు పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి మరీ ప్రైవేటుకు లబ్ధి కలిగేలా నిబంధనలు మార్చేశారెందుకు?
స్పెషల్ టాస్క్బ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఒక భూమిని డెవలప్మెంట్ కింద ఇచ్చేటప్పుడు భూ యజమానికి, డెవలపర్‌కు వాటా సగం సగంగా నిర్ణయిస్తారు. భూమి విలువ ఎక్కువగా ఉన్నచోట భూ యజమాని వాటా మరింత పెరుగుతుంది. రాయదుర్గం.. దేశంలోనే రికార్డుస్థాయిలో ఎకరా ధర రూ.237 కోట్లు పలికిన ప్రాంతం. ఇంత విలువైన చోట ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) నిర్మిస్తున్న ‘యూనిటీ మాల్’లో సర్కార్ వాటా సగం కన్నా ఎక్కువగా ఉండాలి. కానీ ప్రభుత్వం 34 శాతం వాటాతో సరిపెట్టుకుంటున్నది. అంతేకాదు.. గతంలో డెవలపర్‌కు వచ్చిన వాటాను లీజు ప్రాతిపదికన సొమ్ము చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉండేది.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాత్రం డెవలపర్ తన వాటాను మార్కెట్లో అమ్మేందుకు కూడా అనుమతి ఇచ్చారు. వీటిని బట్టే తెరవెనుక రియల్ దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రాచీన హస్త కళలను ప్రోత్సహించడంతోపాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న కళాకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ఏక్తా’ పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వ్యాపారాభివృద్ధి మంత్రిత్వ శాఖ (డీపీఐఐటీ) ఈ పథకాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ర్టాలు తమ రాజధాని నగరంలో ‘యూనిటీ మాల్’ నిర్మాణాన్ని చేపట్టాలి. అక్కడ హస్తకళల ప్రదర్శన ద్వారా వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించినట్టు అవుతుందని కేంద్రం భావించింది.
నగరం మధ్యలో వీటికి భూమిని కేటాయిస్తే మార్కెటింగ్ బాగా అవుతుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి, యూనిటీ మాల్ నిర్మాణాన్ని చేపట్టాలి. సొంతంగా గానీ ప్రైవేట్ నిర్మాణ సంస్థలతో పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలోగానీ చేపట్టవచ్చని కేంద్ర మార్గదర్శకాల్లో ఉన్నది. ఈ భవనాల్లో ఆరు అంతస్తులు (అదనంగా పార్కింగ్ కోసం రెండు బేస్మెంట్స్) కేంద్ర ప్రభుత్వ వాటా కింద హస్తకళల ప్రదర్శనకు కేటాయించాలి. నిర్మాణాల కోసం కేంద్రంలోని డీపీఐఐటీ మంత్రిత్వ శాఖ రాష్ర్టాలకు ప్రత్యేక సాయం పథకం (ఎస్ఏఎస్సీఐ-స్కీంఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) కింద రూ.200 కోట్లను వడ్డీ రహిత రుణంగా ఇస్తుంది.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఈ పథకం రావడంతో తెలంగాణ భాగస్వామి అయ్యింది. హైదరాబాద్ మహానగరంలోని రాయదుర్గంలో యూనిటీ మాల్ నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకు రాయదుర్గంలోని లిడ్‌క్యాప్ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కు చెందిన సుమారు 6.15 ఎకరాల్లో ఐదు ఎకరాలు కేటాయించారు. మిగిలిన ఎకరాకుపైగా స్థలాన్ని రెడ్కోకు కేటాయించేందుకు నిర్ణయించారు.
మొదట్లో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ సెంటర్ (టీజీటీపీసీ) ఆధ్వర్యంలో కేవలం ఆరు అంతస్తులే నిర్మించాలని భావించారు. అయితే అప్పటికే ఎకరా రూ.100 కోట్లకు పైగా పలుకుతుండటంతో అత్యంత ఖరీదైన, భారీగా డిమాండ్ ఉన్న భూమి, పైగా 50 అంతస్తుల వరకు నిర్మించేందుకు అవకాశం, అనుమతి ఉన్న ప్రాంతంలో ఆరు అంతస్తులే నిర్మించడం వల్ల ప్రభుత్వానికే నష్టమని గుర్తించారు. దీనికితోడు యూనిటీ మాల్ నిర్వహణకు ప్రతి నెలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ప్రైవేట్ నిర్మాణ సంస్థకు డెవలప్మెంట్ కింద ఇచ్చి హస్త కళల ప్రదర్శనకు ఆరు అంతస్తులు పోగా, ప్రభుత్వ వాటా కింద వచ్చిన మరిన్ని అంతస్తులను వాణిజ్యపరంగా అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా టీజీటీపీసీకి వచ్చే ఆదాయంతో మాల్ నిర్వహణ సులభం అవుతుందని ప్రణాళిక రూపొందించారు. మాల్ నిర్మాణానికి అప్పట్లోనే కేంద్రం నుంచి రూ.100 కోట్లు కూడా వచ్చాయి. ఇందులో రూ.7 కోట్ల అంచనా విలువతో టీజీటీపీసీ ఐదు బేస్మెంట్ పనులను మొదలుపెట్టేందుకు మట్టి పనులు ప్రారంభించింది. డెవలపర్ ఎంపిక కోసం టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేసింది. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ పథకం అమలు నిలిచిపోయింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లోనే టీజీటీపీసీ ఇంజినీర్లు ఈ ఫైల్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అంతే.. ప్రభుత్వ పెద్దలు దాన్ని ఆదాయ మార్గంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యూనిటీ మాల్ నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు నగరంలోని పలు ప్రముఖ నిర్మాణ కంపెనీలను పిలిపించుకొని మాట్లాడటం ప్రారంభించారు. వెస్ట్ సిటీలో చాలా ప్రాజెక్టులు చేసిన రెండు కంపెనీలు మొదట వెళ్లి మాట్లాడినా, సర్కార్ పెద్దలు ‘సంతృప్తి’ చెందలేదని సమాచారం. కొంతకాలం తర్వాత రెండు నిర్మాణ కంపెనీలు తెరపైకి వచ్చాయి.
అనంతరం ప్రాజెక్టు స్వరూపంతోపాటు అధికారులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్, కన్సల్టెన్సీ ఇలా గతంలో పనిచేసినవారందరూ మారిపోయారు. నిబంధనలన్నీ మారిపోయాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన ఆరు అంతస్తులు పోగా, మిగిలిన దాంట్లో 30 శాతం రాష్ర్టానికి ఇవ్వాలని, 70 శాతం వాటాను డెవలపర్ లీజుకు ఇచ్చుకునేలా నిబంధన పెట్టారు. ప్రభుత్వ అనుమతిలేనిదే అమ్ముకోవడం, తాకట్టు పెట్టుకోవడం చేయకూడదనే షరతు విధించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేసింది.
మొత్తంగా రూ.200 కోట్ల వడ్డీరహిత రుణం, రూ.1500 కోట్ల విలువైన భూమిని ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి తొమ్మిది లక్షల చదరపు అడుగులు వాటాగా నిర్ణయించారు. అంటే అందుబాటులోకి వచ్చే నిర్మాణ విస్తీర్ణంలో 33 శాతం మాత్రమే. దీని ఆధారంగా ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) రూపంలో టెండర్లను పిలిచారు. గతంలో డెవలపర్ తన వాటా వచ్చిన నిర్మాణ విస్తీర్ణాన్ని కేవలం లీజుకు ఇచ్చుకొని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని, ప్రభుత్వ అనుమతి లేనిదే అమ్మడం, తాకట్టు పెట్టడం వంటివి చేపట్టవద్దనే షరతు ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ షరతును పక్కన పెట్టిందని సమాచారం.
డెవలపర్ తన వాటాగా వచ్చిన నిర్మాణ విస్తీర్ణాన్ని అమ్ముకోవచ్చని నిబంధనల్లో వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తున్నది. మాల్ నిర్మాణానికి.. వంశీరాం బిల్డర్స్ లీడ్ మెంబర్‌గా అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మెంబర్‌గా అంటే జాయింట్ వెంచర్‌గా రెండు నిర్మాణ సంస్థలు టెండర్‌ను దక్కించుకున్నట్టు ప్రకటించారు. బిడ్డింగ్‌లో టీజీటీపీసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కనీస వాటాగా నిర్ధారించిన తొమ్మిది లక్షల చదరపు అడుగుల కంటే అదనంగా 18 వేల చదరపు అడుగులు ఇచ్చేందుకు ఈ సంస్థలు ముందుకొచ్చాయని, ఇదే గరిష్ఠం అయినందున వీరికి ప్రాజెక్టును కేటాయిస్తున్నట్టు ఈ ఏడాది మే 6న లెటర్ ఆఫ్ అవార్డు కూడా జారీ చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.2,059.81 కోట్లుగా (భూమి విలువ కాకుండా) పొందుపరిచారు. నిర్మాణ విస్తీర్ణం 27 లక్షల చదరపు అడుగులుగా పేర్కొన్నారు. అంటే ఒక చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి అవుతున్న ఖర్చు రూ.7,626. ఎంత లగ్జరీగా కట్టినా ఎస్ఎఫ్టీకి రూ.4 వేలకు మించదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
పథకంలో భాగంగా కేంద్రం రూ.200 కోట్ల వడ్డీరహిత రుణం ఇస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనే రూ.100 కోట్లు విడుదల చేశారు. టీజీటీపీసీ ఆధ్వర్యంలో ఐదు అంతస్తుల బేస్మెంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి, భూమిని సిద్ధం చేసే పనులను రూ.7 కోట్లతో చేపట్టారు. ఆరంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఏడాది, ఏడాదిన్నరపాటు ‘మథనం’ చేసిన తర్వాత వంశీరాం బిల్డర్స్, అపర్ణ ఇన్ఫ్రా కంపెనీలకు ప్రాజెక్టును అప్పగించింది. అయితే బేస్మెంట్ వ్యయాన్ని కూడా అధికారులు భారీగా పెంచినట్టు తెలిసింది.
గతంలో ఉన్న రూ.7 కోట్ల అంచనా వ్యయాన్ని ఇప్పుడు రూ.54 కోట్లకు పెంచినట్టు సమాచారం. గతంలో ఒక టవర్, ఇప్పుడు రెండు టవర్లు కావడంతో అంచనా వ్యయం రూ.14 కోట్లకు పెరగాలి. ధరల పెరుగుదలను పరిగణలోనికి తీసుకున్నా రూ.20 కోట్ల వరకు ఉండాలి. కానీ ఏకంగా రూ.54 కోట్లకు ఎగబాకింది. దీంతోపాటు పథకం అమలు, సర్వే, కన్సల్టెన్సీ, భూమిని సిద్ధం చేయడం వంటి ప్రక్రియలకు ఖర్చు చేసినట్టుగా రికార్డుల్లో నమోదు చేసినట్టు సమాచారం. మొత్తంగా కేంద్రం నుంచి గతంలో వచ్చిన రూ.100 కోట్లకు సరిపడా ఖర్చులు ఇప్పుడు రికార్డుల్లో నమోదైనట్టు విశ్వసనీయంగా తెలిసింది.

పీఎం ఏక్తా పథకంలో భాగంగా యూనిటీ మాల్ పేరిట చేపట్టిన ఈ ప్రాజెక్టులో రూ.1,500 కోట్ల విలువైన భూమిని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదెంత? అని పరిశీలిస్తే ముక్కున వేలుసుకోవడం ఖాయం.
ఇది తాజా ఒప్పందంలోని రెండు టవర్లలో ఐదు బేస్మెంట్లు 45 అంతస్తులు (మొత్తం 50 అంతస్తులు) ఉంటేనే కనిపించే లెక్క. అయితే ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం డెవలపర్ అంటే వంశీరాం, అపర్ణ కంపెనీలకు మరో వెసులుబాటు కూడా కల్పించిందట. అదేమంటే.. డిజైన్‌లో కంటే నిర్మాణం తర్వాత ఇంతకంటే ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం (27లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ) వచ్చినట్టయితే అది డెవలపర్‌కు చెందుతుంది. అంటే మున్ముందు 50 అంతస్తుల కంటే ఎక్కువ అంతస్తులకు అనుమతులు వచ్చినా అది డెవలపర్‌కే దక్కుతుందన్నమాట! ఎన్ని అంతస్తులు కడితే అంతలా ఆ రెండు కంపెనీల పంట పండుతుందన్నమాట!