శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:02

సాటిగా.. దీటుగా

సాటిగా.. దీటుగా

  • పాత రాష్ర్టాలకు పోటీగా ఆరేండ్ల తెలంగాణ
  • ప్రగతిసూచికల్లో ఉరుకుతున్న కొత్త రాష్ట్రం
  • తలసరి ఆదాయంలో వేగంగా ముందడుగులు
  • అన్నిరంగాల్లో బలోపేతం కావడమే కారణం
  • వ్యవసాయం, గ్రామీణావృద్ధి ప్రధాన పాత్ర

ఆరేండ్లక్రితం ఏర్పడిన తెలంగాణ.. ఆరేడు దశాబ్దాల క్రితం ఏర్పడిన.. పెద్ద రాష్ర్టాలుగా చెలామణిలో ఉన్న రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. అభివృద్ధి, సంక్షేమంలో సత్తా చాటుతున్నది. పలు రంగాల్లో పాత రాష్ర్టాలతో పోటీపడ టమేకాకుండా..కొన్ని అంశాల్లో వాటిని దాటుకుని ముందుకు సాగుతున్నది. మరికొన్ని అంశాల్లో దేశానికే దారి చూపుతున్నది. సంక్షేమంలో వినూత్న పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మౌలిక వసతులు, సంక్షేమం నుంచి పక్కకు తప్పుకుంటుంటే.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల దారిలో నడుస్తున్నది. సంక్షేమం, సుస్థిర అభివృద్ధితో దేశంలోనే అగ్రగామినని చాటుతున్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త రాష్ట్రం తెలంగాణ.. బలమైన ఆర్థిక పునాదులున్న కీలక రాష్ర్టాలకు పోటీగా నిలుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా ఉంటూనే ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో వేగంగా సాగుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తున్న కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు వంటి రాష్ర్టాలకు దీటుగా పురోగతి రేటును నమోదు చేస్తున్నది. ప్రజల జీవన పరిస్థితుల అంచనాలో కీలకమైన తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ ఎన్నో పెద్ద రాష్ర్టాల కంటే ముందున్నది. టాప్‌ 5 రాష్ర్టాలతో పోల్చితే.. ఈ విషయంలో రెండోస్థానంలో నిలిచింది. తెలంగాణ ఏర్పడిన ఆరేండ్ల నుంచి అమలుచేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో తలసరి ఆదా యం వేగంగా పెరుగుతున్నది. జీఎస్డీపీ వృద్ధిరేటులో టాప్‌5లో చోటు దక్కించుకున్నది. ఎక్కువ జనాభా ఆధారపడే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే రంగాలకు అండగా నిలవడంతోనే ఇది సాకారమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు ప్రజల తలసరి ఆదాయం రూ.95,361 ఉండేది. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏకంగా రూ.2,28,216కు పెరిగింది.  

ఒడిదుడుకులు తట్టుకుని..

అంతర్జాతీయంగా ఒడిదుడుకులను తట్టుకుని దాదాపు అన్నిరంగాల్లో తెలంగాణ పురోగతి సాధిస్తున్నది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అనూహ్య ప్రగతిని సాధిస్తున్నది. సేవారంగం పురోగమిస్తున్నది. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌లో మిగిలిన రాష్ర్టాల కంటే తెలంగాణలోనే సంపద పెరుగుతున్నది. ఐటీ ఉత్పత్తుల్లో కర్ణాటకతో పోటీ పడుతున్నది. రియల్‌రంగంలో దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేస్తున్నది. మొత్తం రాష్ట్ర సంపదను 3 రంగాలుగా లెక్కిస్తారు. ప్రాథమికరంగంలో వ్యవసాయం, అనుబంధరంగాలు ఉంటాయి. ద్వితీయరంగంలో ప్రధానంగా పరిశ్రమలు, విద్యుత్‌రంగం, నిర్మా ణం, నీటి సరఫరా వంటివి వస్తాయి. 

సేవారంగంలో ఐటీ, కమ్యూనికేషన్లు, హో టళ్లు, రెస్టారెంట్లు, స్థిరాస్తి క్రయవిక్రయాలు (రియల్‌ ఎస్టేట్‌) ప్రజారవాణా, ఆర్థికసేవలు, సాధారణ పరిపాలన ఉంటాయి. ఈ సంపదను ప్రస్తుత ధరలు, 2011 నాటి స్థిర ధరల వద్ద రెండు రకాలుగా లెక్కిస్తా రు. మొత్తం మన రాష్ట్ర సం పద రూ.9.6 లక్షల కోట్లలో సేవారంగం వాటా 65% ఉన్నది. వ్యవసాయం, అనుబంధరంగాల వాటా 19 శాతంగా ఉన్న ది. పరిశ్రమ ఉ త్పత్తులపై ప్రతికూల ప్రభావం ఉన్నా తెలంగాణ.. జాతీయ సగటు కంటే ఎంతో ముందున్నది. రాష్ట్రం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో 2019-20 లో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పంట గిట్టుబాటు కావడంతో సంపద పెరిగింది. గత ఏడాది 6.6 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఈసారి అమాంతంగా 23.7 శాతానికి పెరిగింది. 

పాడిపరిశ్రమలో వృద్ధిరేటు 15.9% నుంచి 17.30 శాతానికి పెరిగింది. మొత్తంగా ప్రాథమికరంగంలో గతేడాదికంటే 2.6% అధికంగా వృద్ధిరేటు నమోదైంది. ఆర్థిక మాంద్యం, ఇతర ప్రతికూల ప్రభావాలు పరిశ్రమల ఉత్పత్తులు తగ్గడానికి కారణమైంది. పరిశ్రమ ఉత్పత్తుల వృద్ధిరేటు 3.5 శాతానికి తగ్గితే జాతీయస్థాయిలో సగటు వృద్ధిరేటు 1.7 శాతానికి పడిపోయింది. ఐటీ సర్వీసులు, రియల్‌ఎస్టేట్‌, రవాణా సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, విమానయాన సర్వీసులు గతేడాదిలానే ఈసారి 14.1% వృద్ధిరేటు సాధించాయి. ఈ విషయంలో జాతీయ సగటు వృద్ధిరేటు 9.6 శాతమే ఉండటం గమనార్హం. ఎన్నో పెద్ద రాష్ర్టాలు, పాత రాష్ర్టాల కంటే పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ ముందుకు సాగుతున్నది. 

రాష్ర్టానికి రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 13.90 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమైంది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో 2019-20లో 8.20% వృద్ధిని సాధించింది. స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్ర వాటా 21 పాయింట్లు పెరిగి అంతకుముందు ఉన్న 4.55% నుంచి 4.76 శాతానికి చేరింది. ఎస్డీజీ ఇండియా సూచీ ప్రకారం 82% వృద్ధి సాధించింది. మౌలిక వసతుల కల్పన, టీఎస్‌ఐపాస్‌ విధానాలతో పారిశ్రామికరంగానికి తెలంగాణ ఇప్పుడు దేశంలోనే గమ్యస్థానంగా మారింది. దేశంలోని పారిశ్రామికరంగంలో కీలక రాష్ర్టాలకు సాటిగా నిలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి 5% వరకు ఉన్నది. కర్ణాటకలో 7.8%, గుజరాత్‌లో 10%, మహారాష్ట్రలో 7.6% నమోదవుతున్నది.

సంక్షేమంలో ముందు...

ప్రజల కనీస అవసరాలను తీర్చే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా.. తెలంగాణ ప్రభుత్వం సాగుతున్నది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆసరా పెన్షన్లను రూ.3016, రూ.2016 చొప్పున ఇస్తున్నది. 


కీలక రాష్ర్టాల్లో జనాభా, ఆదాయం.. వృద్ధి రేటు

రాష్ట్రం
జీఎస్డీపీ  (రూ.కోట్లు)  
జీఎస్డీపీ వృద్ధి రేటు
జనాభా
తమిళనాడు
18,54,239
13.00
7,21,38,958
గుజరాత్
18,84,922
12.87
6,03,83,628
ఆంధ్రప్రదేశ్
9,72,782
12.73
4,93,86,799
తెలంగాణ
9,69,604
12.60
3,52,86,757
కేరళ
9,78,014
11.60
3,33,87,677
కర్ణాటక
15,35,224
6.80
6,11,30,704
ఒడిశా
5,34,241
6.20
4,19,47,358
మహారాష్ట్ర
28,79,556
5.70
11,23,72,972
రాజస్థాన్
10,20,106
5.00
6,86,21,012


logo