నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, మే 20: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, జగిత్యాల జిల్లా కోరుట్లలో దంపతులు, భూపాలపల్లిలో రెండేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. గద్వాలకు చెందిన జములమ్మ (50), కొడుకు అర్జున్ (24), కోడలు వైశాలి (22) పొట్టకూటి కోసం బొంతలు కుట్టడానికి శనివారం తెల్లవారుజామున ఆటోలో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యా రు.
వీరు ప్రయాణిస్తున్న ఆటో ధరూర్ మండలం పారుచెర్ల స్టేజీ వద్దకు రాగానే ఎదురుగా.. వేగంగా వస్తున్న బొలెరో మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో జములమ్మతోపాటు కుమారుడు అర్జున్, కోడలు వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. అర్జున్, వైశాలికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లికి చెందిన సూర భూమయ్య (33), ప్రేమలత (28) దంపతులు. కోరుట్లలోని ఓ రైస్ మిల్లులో పని చేసేందుకు బైక్‌పై బయలు దేరారు. కోరుట్ల కొత్త బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి వద్ద బైక్ రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వారిపైనుంచి దూసుకుపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి దహన సంస్కారాల కోసం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయుడు సంజయ్ రూ.10 వేల సాయం అందించారు. కాగా భూపాలపల్లిలోని భాస్కర్‌గడ్డలో శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రెండేండ్ల చిన్నారి రాణి అక్కడికక్కడే మృతిచెందింది.