కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలు, లచ్చన్న దళానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరకగూడెం మడలాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మరణించారు. మృతుల్లో లచ్చన్న కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, గతకొంత కాలంగా గుండాల, కరకగూడెం అటవీ ప్రాంతంలో మణుగూరు ఏరియా కమిటీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. లచ్చన్న నాయకత్వంలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఈ ప్రాతంలో సంచరిస్తున్నది. ఈ క్రమంలో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లడపడుతున్నారు. ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. ఘటనా స్థలంలో 2 ఏకే 47 తుపాకులు, 2 ఎస్ఎల్ఆర్లను స్వాధీనం చేసుకున్నారు.