వేల్పూర్, జనవరి 31: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలే బొందపెడతారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలు వంద శాతం నెరవేరతాయని సీఎం రేవంత్‌రెడ్డి అనడంపై వేముల మండిపడ్డారు. గ్యారంటీలు అమలు చేయకుండా పారిపోవడానికే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారాన్ని సకాలంలో పసిగట్టలేకపోయామని, దానివల్లే కాంగ్రెస్ లబ్ధి పొందిందని వివరించారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న హామీలను పార్లమెంట్ ఎన్నికలకు ముందే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణం తెచ్చుకుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని, జరిగిందా? అని ప్రశ్నించారు. పంట కోత దశకు చేరుతున్నా రైతుబంధు ఎందుకు అందలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో మంజూరైన 6 వేల గృహలక్ష్మి ప్రొసీడింగ్‌లను రద్దు చేశారని విమర్శించారు.
అక్రమ కేసులకు భయపడం: పల్లా
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేసులకు భయపడేటోళ్లం కాదని, హామీల అమలుకు ప్రజలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై నోటికొచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసి అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. లక్ష కోట్ల అవినీతి జరిగితే రంగనాయకసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఎలా వచ్చిందో ఆలోచన చేయాలని సూచించారు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏమయ్యాయని పల్లా ప్రశ్నించారు.