Six Guarantees | హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో భరోసా దక్కలేదు. ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. కొన్నింటి అమలు ఊసే లేకపోగా, మరికొన్నింటికి అరకొరగా నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం నాలుగు హామీలనే అమలు చేస్తున్నది. అన్నింటినీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు. ఈ బడ్జెట్లో రైతుభరోసా, కూలీలకు భరోసా, వరి పంటకు బోనస్, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇంటర్నేషనల్ స్కూల్ పథకాన్ని అమలు చేసేందుకు నిధులు కేటాయించింది.
మహాలక్ష్మి గ్యారెంటీ పథకంలో మూడు హామీలున్నాయి. వీటిలో రెండింటిని అమలు చేస్తున్నది. మరొకటైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం హామీపై ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయకపోగా, ఒక్కపైసా కేటాయించలేదు. దీంతో ఈ పథకం అమలును ప్రభుత్వం పక్కకు పెట్టినట్టే.
రైతుకూలీలకు భరోసా పథకంంలో మూడు గ్యారెంటీలు ఉండగా ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. తాజాగా బడ్జెట్లో మూడు హామీల అమలుకు నిధులు కేటాయించింది. ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున భరోసా, వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్‌ను అమలు చేయనున్నది. ఈ మూడు హామీలకు సుమారు రూ. 32 వేల కోట్ల నిధులు అవసరం కాగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే కేటాయించింది.
గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. ఈ పథకం కోసం తాజా బడ్జెట్లో రూ.2,418 కోట్లు కేటాయించింది.
ఇందిరమ్మ ఇండ్ల గ్యారెంటీ పథకంలో ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఇంటి స్థలం లేని వారికి స్థలంతోపాటు రూ.5 లక్షలు, ఉద్యమకారులకు రూ.250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. తాజా బడ్జెట్లో స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునేందుకు మాత్రమే రూ.5 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించింది. మొత్తం 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్ల నిధులు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.9,184 కోట్లు కేటాయించింది. ఇక మిగిలిన రెండు హామీలను ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
ఈ గ్యారెంటీలో విద్యార్థులకు విద్యాభరోసా కార్డు ద్వారా రూ.5 లక్షలు ఇవ్వడంతోపాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో తొలి హామీని విస్మరించగా, ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది.
చేయూత గ్యారెంటీ పథకంలో సామాజిక పింఛన్లను రూ.4 వేల పెంపుతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీటిలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేస్తున్నది. సామాజిక పింఛన్ లబ్ధిదారులు, పెండింగ్ దరఖాస్తులు కలిపితే ఏటా రూ.27 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి. ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో కేవలం రూ.14 వేల కోట్లనే కేటాయించింది. దీంతో అర్హులైన అందరికీ రూ.4 వేల చేయూత పింఛన్ అమలవుతుందా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.