Fire Accident | సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా 25 ఏళ్ల లోపు వారేని సమాచారం.
గురువారం రాత్రి 7.45 నిమిషాలకు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 10 మందిని సిబ్బంది రక్షించారు. అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన ఆరుగురు ఐదో అంతస్తులో ఒక రూంలో చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. డోర్లు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చినప్పటికీ స్పృహ కోల్పోయి ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా దట్టమైన పొగతో ఊపిరాడకనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, ప్రశాంత్ శివ ఉన్నారు.