Congress | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ గురువారం అర్ధరాత్రి పార్టీలో చేర్చుకున్నది. రాత్రి ఒంటిగంట సమయంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంట్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాదరావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశంను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు.. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుసటి రోజే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చట్టాన్ని గౌరవించటం తన అభిమతమని, నైతికంగా ఉండటం ధర్మమని తన రాజీనామా సందర్భంగా కేశవరావు ప్రకటించారు.
కానీ ఇప్పటివరకు బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఇటీవల జిగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి రాత్రి పదకొండు తరువాతే కాంగ్రెస్ కండువా కప్పటం, తాజాగా ఎమ్మెల్సీలు కూడా అర్ధరాత్రి దాటిన తరువాత ఆ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీకటి రాజకీయాలకు తెరతీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీరికి నైతికత లేదా?
పార్టీ మారినందుకే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేశానని కే కేశవరావు ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి, నైతిక విలువలకు గౌరవాన్ని ఇచ్చి తాను ఎంపీ పదవి నుంచి వైదొలగిన నేపథ్యంలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇది వర్తించదా? అన్న చర్చ విస్తృతంగా సాగుతున్నది. కేకే రాజీనామా చేసినట్టుగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా పదవులను వీడి మళ్లీ ఎన్నికల్లో గెలవాల్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్నది. మరోవైపు త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, వారిని కూడా రాత్రిపూటే చేర్చుకుంటామని చెప్తున్నారు.