హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్ : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రాష్ట్రంలో సమగ్ర కులగణనను తక్షణమే చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ నేతలు చేపట్టిన ఆమరణదీక్షపై కాంగ్రెస్ సర్కారు కనికరించని పరిస్థితి కనిపిస్తున్నది. దీక్షాపరుల ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయని దుస్థితి నెలకొన్నది.
కొనసాగుతున్న దీక్షలు..
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జకని సంజయ్‌కుమార్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు భక్తుల సిద్దేశ్వర్, రజక సంఘం నాయకుడు చాపర్తి కుమార్గాడ్గే గత నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. హామీలపై స్పష్టతనివ్వని సర్కారు దీక్షను భగ్నం చేసేందుకు పూనుకున్నది. దీక్ష చేపట్టిన నేతలను అరెస్టు చేసింది. కుమార్గాడ్గేను హన్మకొండ జిల్లా మడికొండకు తరలించింది. అనంతరం ఎంజీఎంలో చేర్చగా, కుమార్గాడ్గే వైద్యశాలలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. సిద్ధేశ్వర్, సంజయ్‌ను అరెస్టు చేసి గాంధీ దవాఖానలో చేర్చించింది. వారు అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు. సంజయ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించింది.
వెల్లువెత్తిన మద్దతు..
దీక్షాపరులకు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ సంఘీభావం తెలిపారు. బీఆర్‌నేత సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి బీసీ నేతలకు మద్దతు ప్రకటించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేశ్, సీపీఎం, పలు సంఘాలు మద్దతు తెలిపాయి. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గాంధీదవాఖానకు వెళ్లి దీక్షాపరులను పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు సైతం దీక్షకు మద్దతు ప్రకటించారు. గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న సిద్దేశ్వర్‌ను సోమవారం బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సోషల్ జస్టిస్ పార్టీ ఇన్చార్జి కేవీ గౌడ్, బీసీ ఆజాది సంఘ్ అధ్యక్షుడు డీ మహేశ్‌గౌడ్, అంబేద్కర్ అజాదీ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరి పరామర్శించి సంఘీభావం తెలిపారు. కాచిగూడలో దీక్ష చేస్తున్న సంజయ్‌ను జర్నలుస్టులు పాశం యాదగిరి, జూలూరు గౌరీశంకర్ పరామర్శించారు.
పత్తాలేని బీసీ సంక్షేమ శాఖ మంత్రి
బీసీ నేతల దీక్షకు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తున్నా కాంగ్రెస్ సర్కారు మాత్రం ఏమాత్రం లెక్కచేయని దుస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు స్పందించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కనీసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఇప్పటివరకు దీక్షపై స్పందించకపోవడంతో బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.
ఇక సర్కారుతో యుద్ధమే
సమగ్ర కులగణన, రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. బీసీ నేతల దీక్షపై ఇప్పటివరకు స్పందించకపోవడం కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరికి నిదర్శనం. అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్టు బీసీలను మోసం చేస్తే కాంగ్రెస్‌కు రాజకీయ సమాధి తప్పదు. ఇక కాంగ్రెస్ సర్కారుపై బీసీల యుద్ధం మొదలైంది. హామీలు అమలయ్యే వరకు విశ్రమించేది లేదు.
-రాజారాంయాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు