Telangana | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చాలాచోట్ల వరి చేలు పొట్టదశలో ఉన్నాయి. నీటిని ఎక్కు వ మోతాదులో అందించాల్సిన సమయం ఇది. లేదంటే తాలుగా మారి, దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంటుంది. ఎక్కువ మోతాదు సంగతేమో కానీ, చుక్క నీటిని కూడా అందించలేని సంకట పరిస్థితి ఎదు రైంది. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అప్పుడే అడుగంటిపోయాయి. సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ తదితర మేజర్ ప్రాజెక్టులే కాదు, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. మరో నెల వరకు సాగునీటిని అందించాల్సి ఉంది. అయితే ఈ పరిస్థితికి రాష్ట్రసర్కారు ప్రణాళిక వైఫల్యమేనని స్పష్టంగా తేలిపోయింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 21 శాతం అధిక వర్షపాతం కురిసినా, ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లినా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వేసవి ప్రారంభంలోనే అడుగంటడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వేసవి తీవ్రత పెరిగితే పరిస్థితి మరింత దుర్భరంగా మారేలా ఉన్నది. వేసవి ప్రారంభంలోనే ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోయాయంటే పరిస్థితి ఎంత త్రీవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఎండుతుండగా, అదే సమయంలో పొరుగున్న ఉన్న రాష్ర్టాల్లోని జలాశయాలన్నీ నిండుగా కళాకళలాడుతుండటం గమనార్హం.
కొరవడిన ప్రణాళిక
బీఆర్ఎస్ సర్కారు సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగేది. పదేండ్లపాటు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తూ వచ్చింది. తద్వారా రెండు పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ రంది లేకుండా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలోని వేలాది చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సర్కారు అనుసంధానం చేయడమే అందుకు కారణం. ఇక ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే ఆయా ప్రధాన ప్రాజెక్టుల నుంచి జలాలను చెరువులకు మళ్లించేది. ఇలా ఏటా అక్టోబర్ లేదా డిసెంబర్లో చెరువులు, చెక్‌డ్యామ్‌లను క్రమం తప్పకుండా నింపుతూ ఉండేది. ఫలితంగా భూగర్భజలాలు పడిపోకుండా ఉండేవి. అదేవిధంగా 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం వల్ల బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్‌లు కూడా సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కానీ, కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది అలాంటి పనులేవీ చేయలేదు.
మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా ప్రచారం కోసం అంచనాలను రూపొందించి ప్రకటనలు జారీచేసింది. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 354 టీఎంసీలతో 42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) లెక్కతేల్చింది. వరితోపాటు, ఇతర పంటల సాగుకు ప్రారంభంలో నీటి అవసరాలు తక్కువగానే ఉంటాయి. అయితే పంటలు ఎదిగే దశలో నీటి పరిమాణం ఎక్కువ అవసరమని, ఆ దశ వచ్చేనాటికి నీటినిల్వలు సరిపోయే పరిస్థితి లేదని ఆనాడే క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం అందుబాటులో లేనందున ఎస్సారెస్పీ స్టేజీతోపాటు, ఎల్ఎండీ దిగువకు, రంగనాయకసాగర్ ఆయకట్టుకు నీరివ్వలేమని తేల్చిచెప్పారు. అదీగాక చాలాచోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువల్లో పూడిక పేరుకుపోయి ఉందని, కంపచెట్లు విపరీతంగా పెరిగాయని తెలిపారు. ఆయా కాలువల్లో డిజైన్ సామర్థ్యం మేరకు సాగునీరు ప్రవహించని దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
నీటి రవాణా నష్టాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయని, కొన్ని చోట్ల పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేసినా కాలువల చివరి ఆయకట్టుకు ఇప్పుడే నీరందని దుస్థితి నెలకొంటుందని నొక్కిచెప్పారు. కాలువల పొడవునా రైతులు మోటర్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నీటిని వినియోగిస్తున్నారని, వెరసి దిగువకు నిర్దేశించిన మొత్తం కంటే తక్కువగానే నీళ్లు వెళ్తున్నాయని సర్కారుకు వివరించారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం తైబందీని ఖరారు చేసింది. కాళేశ్వరం లేకున్నా నీరిచ్చామనే ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత ప్రణాళికలను గాలికొదిలేసింది. చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపకపోవడం వల్ల ప్రస్తుతం భూగర్భజలాలు పడిపోతున్నాయి. వెరసి నాడు అధికారులు చేసిన హెచ్చరికలే నేడు నిజమవుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుండగా, రైతాంగం ఆగమాగమవుతున్నది. మరో నెల రోజుల పాటు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటికే ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. ఇది ప్రభుత్వ ప్రణాళిక రాహిత్యమేనని సుస్పష్టంగా అర్థమవుతున్నది.
మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ ఈ ఏడాది అదే పరిస్థితి నెలకొన్నది. వేసవి ప్రారంభంలోనే అడుగంటిపోతున్నాయి. రామప్ప, లక్నవరం, పాకాల, మత్తడివాగు, నీల్వాయి, కిన్నెరసాని, పాలేరు, పాలెం, కోటిపల్లి, వైరా, లంకాసాగర్, మూసీ, శనిగరం, రామడుగు, మల్లూరు, గుండ్లవాగు, బయ్యారం, స్వర్ణ తదితర ప్రధాన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటాయి. అనేక ప్రాజెక్టులు ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. ఇక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చెరువులు, చెక్‌డ్యామ్‌ల్లోనూ ప్రస్తుతం 25 శాతం మేర కూడా నీటినిల్వలు అందుబాటులో లేవని అధికారులే వెల్లడిస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ఏడాది నీటి ఎద్దడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టులు అడుగంటిపోవడం, కాలువల ద్వారా ఈ సారి ఆశించిన మేర నీటిసరఫరా లేని కారణంగా నిరుడితో పోలిస్తే ఈ ఏడాది వేసవికి ముందే భూగర్భజలాలు తగ్గిపోయాయి.
ఈసారి అటు పంటల సాగుకు, ఇటు గృహవినియోగానికి సైతం పూర్తిగా బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో భూగర్భజలాలు లోలోతుకు పడిపోతున్నాయి. నిరుడు ఫిబ్రవరి నాటికే 1.36 మీటర్ల మేర లోతుకు భూగర్భజలాలు తగ్గిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో భూగర్భజలాలు పడిపోతున్నాయి. భూగర్భజలమట్టం నిరుడు ఇదే సమయానికి 7.34 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 8.70 మీటర్లుగా నమోదైనట్టు భూగర్భజల శాఖ నివేదిక వెల్లడిస్తున్నది. అంతేకాదు 2014-2024 మధ్యకాలంతో పోల్చి చూసినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 21 శాతం మేరకు భూగర్భజలమట్టం తగ్గిపోవడం గమనార్హం. ఇప్పటికే బోర్లు వట్టిపోతుండగా, బావులు ఎండిపోతుండగా, ఎండలు తీవ్రమయ్యే కొద్దీ మరింత లోతుకు పడిపోయే అవకాశమున్నదని నీటిరంగ నిపుణులు వివరిస్తున్నారు. వెరసి తాగునీటికి సైతం తండ్లాట తప్పదని తెలుపుతున్నారు.
తెలంగాణ ఎండగా.. పొరుగున నిండుగా
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి మొదలు దిగువన ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఈ ఏడాది 844 టీఎంసీల మేరకు జలాలు సముద్రంలో కలిశాయి. అంటే ఎంత భారీగా వరదలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. గత నవంబర్ వరకు వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు ఇరు రాష్ర్టాలకు కలిపి 1,010పైగా టీఎంసీలు ఈ ఏడాది వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి. 3 నెలల క్రితం వరకు రిజర్వాయర్లు నిండుగానే ఉన్నాయి. కానీ, ఏపీ యథేచ్ఛగా జలాలను మళ్లించడం, తెలంగాణ ఏ దశలోనూ నిలువరించకుండా అచేతనంగా చూస్తూ ఉండడంతో పరిస్థితి ఒక్కసారిగా గాడితప్పింది.
ప్రస్తుతం ఆ రెండు రిజర్వాయర్లలో నిల్వలు సాధారణం కన్నా కనిష్ఠానికి పడిపోవడం అందుకు నిదర్శనం. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి చేరువయ్యాయి. రెండు రిజర్వాయర్లలో కలిపి 40 టీఎంసీలు కూడా అందుబాటులో లేని దుస్థితి. గోదావరి బేసిన్లోనూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీగా వరదలు వచ్చాయి. 100 రోజులకు పైగా వరద ప్రవాహాలు కొనసాగాయి. ఈ ఏడాది మొత్తంగా దాదాపు 4,150 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. అక్టోబర్ 29వ తేదీ వరకు వరద ప్రవాహాలు కొనసాగాయి. అయినప్పటికీ బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోనూ ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సారెస్పీ ఆయకట్టు సై తం ఎండుతున్నది. గోదావరి బేసిన్లోనూ నీటిఎద్దడి పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం ప్రభుత్వం సరైన సమయంలో మేల్కొనకపోవడమేనని అర్థమవుతున్నది. నీటి నిర్వహణను పూర్తిగా విస్మరించిందని తేటతెల్లమవుతున్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ప్రస్తుతం ఎస్సారెస్పీ స్టేజీ -1 కింద 7,99,472 ఎకరాలు, గుత్ప, అలీసాగర్, సరస్వతీ, లక్ష్మీ కెనాల్ కింద కలిపి దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తైబందీ ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ వరకు కాలువలకు నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. అందుకు దాదాపుగా ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొని మరో 12 టీఎంసీల కంటే ఎక్కువ జలాలు అవసరమని అంచనా.
నిజాంసాగర్
ప్రాజెక్టు కింద ఈ యాసంగి సీజన్లో 1,24,254 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఏప్రిల్ 12వ తేదీ వరకు కాలువలకు నీళ్లను విడుదల చేస్తామని సర్కారు ప్రకటించింది. ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొని మరో 2 టీఎంసీల జలాలు అవసరం. సాగునీరు అందిస్తే తాగునీరు అందించలేని దుస్థితి.
ఎల్లంపల్లి
ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఎల్లంపల్లి, గూడెం లిఫ్ట్ కలిపి 60 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. ఏప్రిల్ 12వ తేదీ వరకు కాలువలకు నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఈ మేరకు జలాలు అందుబాటులో లేవు. డెడ్ స్టోరేజీపోగా మిగిలిన జలాలు విద్యుత్తు ఉత్పత్తి, ఎరువుల ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు, మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకే సరిపోని దుస్థితి.
నాగార్జునసాగర్
ప్రాజెక్టు ద్వారా ఏఎమ్మార్పీ 2.38 లక్షల ఎకరాలు, సాగర్ ఎడమ కాలువ కింద 6.38 లక్షల ఎకరాలు మొత్తంగా 8.76 లక్షల ఆయకట్టు సాగులో ఉన్నది. తైబందీ ప్రకారం ఏప్రిల్ 23వరకు కాలువలకు నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. మరో 2 తడుల వరకు నీటిని అందించాలి. అందుకు ట్రాన్స్మిషన్ నష్టాలతో 20 టీఎంసీలకుపైగా జలాలు అవసరం. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ మీద అందుబాటులో ఉన్నది 17 టీఎంసీలే. ఇంకా హైదరాబాద్, నాగార్జునసాగర్, హుజూర్నగర్, మిర్యాలగూడ, కోదాడ, నల్లగొండ, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలు తీర్చాలి ఉంది. అదీగాక ఏపీ ఇప్పటికీ జలాలను తరలిస్తున్నది.
శ్రీశైలం రిజర్వాయర్
ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కల్వకుర్తి కింద 2.80 లక్షల ఆయకట్టు సాగవుతున్నది. ఏప్రిల్ 23వ తేదీ వరకు కాలువలకు నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. అందుకు దాదాపుగా ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొని మరో రెండు తడులుకు 8 టీఎంసీల జలాలు అవసరం. ప్రస్తుతం డెడ్‌స్టోరేజీ వరకు అందుబాటులో ఉన్నదే 18 టీఎంసీలు. ఇందులో ఏపీ వాటా కూడా ఉన్నది. అవిగాక ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు, మరో రెండు జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది.
లోయర్ మానేరు డ్యామ్
ప్రస్తుతం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ స్టేజీ-1 కింద 3.61 లక్షల ఎకరాలు, స్టేజీ- 2 కింద 3.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తైబందీ ప్రకారం ఏప్రిల్ 8 వరకు కాలువలకు నీళ్లను విడుదల చేయాలి. అందుకు ట్రాన్స్మిషన్ నష్టాలతో మరో 18 టీఎంసీల కంటే ఎక్కువ జలాలు అవసరం. ప్రస్తుతం డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు పోగా మిగిలేది 2 టీఎంసీలే. కరీంనగర్ పట్టణ ప్రజల దాహార్తినీ తీర్చాల్సి ఉంది.
శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు)
ప్రస్తుతం ప్రాజెక్టు కింద 53 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు జలాలను సరఫరా చేయాల్సి ఉంది. తైబందీ ప్రకారం ఏప్రిల్ 12వ తేదీ వరకు కాలువలకు నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. అందుకు ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొని మరో 2 టీఎంసీల జలాలు అవసరం. కానీ ఆ పరిస్థితి లేదు.
జూరాల
రిజర్వాయర్ నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల కలిపి యాసంగిలో 1.20 ఎకరాలు సాగునీరందించాలి. ఏప్రిల్ 23వరకు కాలువలకు నీళ్లను విడుదల చేస్తామని సర్కారు చెప్పింది. ట్రాన్స్మిషన్ నష్టాలను కలుపుకొని మరో టీఎంసీ జలాలు అవసరం. డెడ్‌స్టోరీజీ పోగా అర టీఎంసీ జలాలు కూడా అందుబాటులో లేవు. అదీగాక ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ నీళ్లు అందించాల్సి ఉంది.