హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): సన్న బియ్యం టెండర్లలో జరిగిన కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ డిమాండ్ చేశారు. సన్న బియ్యం కుంభకోణంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. పౌరసరఫరాల సంస్థ అవినీతి, టెండర్లలో అవకతవకలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని ప్రకటించారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పౌరసరఫరాల సంస్థ టెండర్లలో జరిగిన అవినీతిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతోపాటు బయటపెట్టారని గుర్తు చేశారు. టెండర్లు పిలిచింది నిజమా? కాదా? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ మాటల్లో విషయం లేదని ఎద్దేవా చేశారు. కిలో రూ.57కు సన్నబియ్యం కొనాలని ప్రభుత్వమే టెండర్లలో అంత రేటు నిర్ణయిస్తే బహిరంగ మారెట్లో ధరల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.2,007 అని టెండర్లలో నిర్ణయిస్తే ఏజెన్సీలు రైస్మిల్లల్ల వద్ద రూ.2,230 వసూలు చేయడం నిజం కాదా? అని నిలదీశారు. యుద్ధ విమానాలు నడిపిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పౌరసరఫరాల సంస్థలో ఆదాయం పెంచుతున్నామని చెప్తున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఎట్లా ఆదాయం పెంచారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిఫాల్టర్లను జైలుకు పంపించామని, ఆర్ఆర్ యాక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రయోగించటంలేదని నిలదీశారు. టెండర్ల ఆరోపణలపై బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకటేనని ఆరోపించారు.