జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మిడి (వాల్మీకాపురం) గ్రామంలోని గుట్ట పైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో హోమగుండ కార్యక్రమం ప్రారంభమైంది.
అలాగే చిన్న జీయర్ స్వామి వారిని హోమ గుండానికి సంప్రదాయబద్ధంగా మంత్రి ఎర్రబెల్లి ఆహ్వానించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, నరసింహారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీప్రసన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.