Sitarama Project | కలములకలపల్లి, మార్చి 5: కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు దిక్కు అయ్యిం ది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ వ్యతిరేకించినా ఆ ప్రాజెక్టే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణాజలాలను తరలించుకుపోయినా సాగర్ ఎడ మ కాల్వ కింద ఉన్న మూడు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారానే ఇప్పుడు జీవం వచ్చింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం అడుగంటి సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలు సాగ ర్ కాల్వలో కలిసేలా రూపుదిద్దుకున్న సీతారామ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఏన్కూరు కాల్వ ఎండిపోతున్న పంటలకు ఇప్పుడు శ్రీరామరక్షగా నిలిచింది. గోదావరి కృష్ణమ్మతో కలిసి ఉమ్మడి జిల్లా వ్యవసాయ భూముల్లో పరవళ్లు తొక్కింది. చాలీచాలని నీళ్ల తో ఎండిపోతున్న యాసంగి పంటలను పసిడి పచ్చగా తీర్చిదిద్ది సిరులు కురిపించే అద్భుత దృశ్యం బుధవారం సాక్షాత్కరించింది. తెలంగాణ సాధకుడు, నిత్య కృషీవలుడు, రైతుల పక్షపాతి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ స్వప్నం సాకారమైంది. సీతారామ ప్రాజెక్టులోని మూడో దశ పంపుహౌజ్ నుంచి 12 కిలోమీటర్ల మేర ఏన్కూరు కాల్వను తవ్వడం వల్ల గోదావరి జలాలు నేరుగా సాగర్ ఎడమ కాల్వకు తరలిపోతున్నాయి. కేసీఆర్ ప్రభు త్వం వేల కోట్లను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసి రాష్ట్రంపై అప్పుల భారాన్ని పెంచుతున్నారని కాంగ్రెస్ నాడు ప్రతిపక్షంలో ఉన్నపుడే కాదు.. ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నది. కానీ అది ఖర్చు కాదు… తెలంగాణ రైతాంగ శ్రేయస్సుకు వెచ్చించిన పెట్టుబడి అని తాజాగా రుజువైంది.
కృష్ణమ్మతో కలిసి గోదావరి పరవళ్లు
సాగర్‌లో నీటి లభ్యత తగ్గిపోవడంతో ఉమ్మ డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు సాగునీరు అవసరం తీవ్రంగా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో గోదావరి నదీ జలాలను నాగార్జున సాగర్ కాలువకు అనుసంధానం చేస్తూ ఈ నెల 3న సీతారామ చివరి పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాల లిఫ్టింగ్ ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడి నుంచి గోదావరి నీళ్లు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా బుధవారం సాగర్ ఆయకట్టుకు నీరు చేరాయి.
కేసీఆర్‌కు జనం నీరాజనం
ప్రత్యేక రాష్ట్రంలో జలవనరుల వినియోగాన్ని సమర్ధవంతంగా చేసేందుకు కేసీఆర్ పా లనలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టులో ప్రధానమైంది సీతారామ ప్రాజెక్టు ఒకటి. 2016లో ఎనిమిది వేల కోట్లు అంచనా వ్యయంతో మొ దలైంది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు నుంచి ములకలపల్లి మండలం కమలాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవు కాల్వ పనులతోపాటు బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం గ్రామాల్లో మూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు 90శాతం పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. సీతారామ ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో సాగునీటి సౌకర్యానికి నోచుకోక పడావు పడిన లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయనున్నది. ఇప్పటికే చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడంలేదని సాగర్ ఎడమ కాల్వ కింద రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమయంలో సీతారామ ప్రాజెక్టు వరప్రదాయినిగా లక్షలాది మంది రైతాంగాన్ని ఆదుకోవడంతో ఆయకట్టు రైతులు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ ముందుచూపు సాగర్ ఆయకట్టుకు జీవం పోసినట్టుందని జనం నీరాజనాలు పలుకుతున్నారు.
కేసీఆర్ కృషి ఫలితమే.. సీతారామ ప్రాజెక్టు ; మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో వెల్లడి
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయాలని దూరదృష్టితో కేసీఆర్ చేసిన ప్రయత్నమే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు రూపకల్పన అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ కుట్రలను ఛేదించి వడివడిగా(90శాతం) పను లు పూర్తి చేశామని వివరించారు. సీతారామ ప్రాజెక్టు కోసం నాటి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలు వృథా ప్రాజెక్టు అని, అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసు లు వేయించారని ఉదహరించారు. కేసీఆర్ పట్టుబట్టి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారని వివరించారు. ఫలితంగానే నేడు కరువు కోరల్లో చికుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధం గా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ఫొటోలకు మంత్రు లు, నాయకులు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూ డెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా ల సాగు, తాగునీటి కష్టాలకు సీతారామ ప్రాజెక్టు శాశ్వత పరిషార మార్గమని స్ప ష్టంచేశారు. ప్రత్యక్షంగా ఆరు లక్షల ఎనభై వేల ఎకరాలకు, పరోక్షంగా పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయని ఎక్స్ వేదికగా వెల్లడించారు.