హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏర్పడిన సిట్ అధికారి జారీచేసిన నోటీసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ కోరినట్టుగా తాను శుక్రవారం విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సిట్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి గురువారం సాయంత్రం లేఖ రాశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజని తెలిపారు. పార్టీ చిహ్నాలపై ఈ ఎన్నికలు జరుగుతున్నందున, బీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన ఆథరైజేషన్లపై పార్టీ అధినేతగా తానే సంతకాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఇది ముందే ఖరారై ఉన్న నేపథ్యంలో తాను విచారణకు హాజరుకాలేనని వివరించారు. తనను విచారించేందుకు శుక్రవారం తప్ప మరి ఏరోజైనా సరే వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. సిట్ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం తమకు అనుకూలమైన తేదీని నిర్ణయించి, తనకు ముందే తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం తాను నివాసముంటున్న సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం, ఎర్రవల్లి గ్రామంలోని ఇంటికి వచ్చి విచారణ చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుతమైన ఈ దేశపౌరుడిగా విచారణకు పూర్తి సహకారం అందజేస్తానని పేర్కొన్నారు. విచారణకు సంబంధించిన తదుపరి ఉత్తరప్రత్యుత్తరాలను ఇకపై ఎర్రవల్లిలోని తన నివాసం నుంచే కొనసాగించాలని సూచించారు.
సిట్ అధికారి వెంకటగిరి రాసిన లేఖలో కేసీఆర్‌ను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లేదా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా విచారణకు రావాలని కోరిన నేపథ్యంలో సీఆర్పీసీ 160లోని నిబంధనలను కేసీఆర్ కూలంకశంగా వివరించారు. సీఆర్పీసీ 160లో ఎక్కడ కూడా టెరిటోరియల్ బౌండరీలు (సరిహద్దులు) ఇవే అని పేర్కొనలేదని ఎత్తిచూపారు.
‘దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తన సొంత లేదా పక్కనే ఉన్న స్టేషన్ పరిధిలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఇచ్చిన సమాచారాన్ని బేరీజు వేసుకొని లేదా ఇతర వాస్తవాలతో సంబంధం ఉన్నట్టు అనిపిస్తే సాక్షులను తన ఎదుట హాజరవ్వాలని లిఖితపూర్వకంగా ఆదేశించవచ్చు. అయితే, దీనికి కూడా కొన్ని మినహాయింపులున్నాయి. పదిహేను సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న పిల్లలు లేదా 65 ఏండ్లు దాటినవారు, లేదా స్త్రీలు, లేదా మానసిక, శారీరక వైకల్యం ఉన్న వ్యక్తులను వారు నివసించే ప్రదేశంలోనే విచారణ నిర్వహించాలి.
మరే ఇతర ప్రదేశానికి విచారణ నిమిత్తం రావాలని బలవంత పెట్టరాదు’ అని చట్టంలో స్పష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. 65 ఏండ్లకు పైబడిన వ్యక్తిని పోలీసుస్టేషన్లో విచారణకు హాజరవ్వాల్సిన అవసరం లేదని చట్టం చెప్తున్నదని, విచారణాధికారి లేదా బృందం ఆ వ్యక్తి నివసించే చోటనే విచారణకు రావాల్సి ఉంటుందని స్పష్టంగా ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణాధికారి ఎర్రవెల్లిలోని తన నివాసంలోనే తనను విచారించేందుకు రావాలని స్పష్టంచేశారు.
సిట్ నోటీసుల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ న్యాయవాదులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో న్యాయవాదులతోపాటు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. శుక్రవారమే విచారణకు రావాలన్న సిట్ నోటీసుపై చర్చించి, జవాబు లేఖను తయారు చేసి పంపించారు.
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా, బాధ్యతగల పౌరుడిగా, చట్టాలను గౌరవించే వ్యక్తిగా సిట్ విచారణకు వస్తానని చెప్పి, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తన విచారణను వాయిదా వేయాలని కోరిన కేసీఆర్ వివరణతో సిట్ అధికారులు సంతృప్తి చెందారు. గురువారం రాత్రి కేసీఆర్ పంపిన లేఖను పరిశీలించిని సిట్ అధికారులు.. ఆయనకు తగిన సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు ఎప్పుడు ఇవ్వాలనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే మరో విచారణ తేదీని ప్రకటిస్తామని సిట్ అధికారులు తెలిపారు.