హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు పంపటం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల్లో ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉన్నదని, కేంద్రంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీ ఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థల అధికారులకు మాత్రమే అనుమానితుల ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం ఉన్నట్టు రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి ప్రమేయం ఏమాత్రం ఉండదని, నివేదిక మాత్రమే సీఎంలకు, పీఎంలకు అందుతుందని వారు వివరిస్తున్నారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, ప్రజా భద్రత దృష్ట్యా కేంద్రం, రాష్ట్రాలు ఫోన్‌ట్యాపింగ్ చేయవచ్చని ప్రజాభద్రత, ‘భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు లేదా పబ్లిక్ ఆర్డర్, నేరం చేయడానికి ప్రేరేపించడాన్ని నిరోధించడం’ కోసం ఇది అవసరమని సంతృప్తి చెందితే ఈ ఉత్తర్వును సంబంధిత శాఖ జారీచేస్తుందని నిపుణులు వివరించారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ (సవరణ) రూల్స్, 2007లోని రూల్ 419ఏ ద్వారా ఫోన్‌ట్యాపింగ్ చేయడానికి ఆసారం ఉన్నదని అంటున్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి ఉత్తర్వుల ద్వారా ఫోన్‌ట్యాప్ చేసే అధికారం సంబంధిత శాఖలకు సంక్రమిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర హోం కార్యదర్శి లేదా రాష్ట్ర హోం కార్యదర్శి ద్వారా అధికారం పొందిన జాయింట్ కార్యదర్శి స్థాయి అధికారి కూడా ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చని వారు తెలిపారు.
ఆ ట్యా పింగ్ ఆదేశాలను కాంపిటెంట్ అధికారి రద్దు చే యకపోతే 60 రోజులకు మించకుండా ట్యాపింగ్ చేయవచ్చని, కాంపిటెంట్ అధికారి 180 రోజుల వరకు ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వవచ్చని వివరించారు. ఓటుకు నోటు ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చడం వంటివి ‘నేరం చేయడానికి ప్రేరేపించడాన్ని నిరోధించడం’ కిందికి వస్తుంది తప్ప ఆర్టికల్ 21 కింద ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛరక్షణ కిందికిరాదని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.