Sajjanar | హైదరాబాద్, జనవరి 23 : ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అవసరమైతే మళ్లీ పిలుస్తామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి ఎదుట కేటీఆర్ హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను విచారించామని, కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతోపాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో వాటిని విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. సాక్షులను ఎవరినీ సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆయనకు సూచించామని తెలిపారు.
అవసరమైతే విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని చెప్పామని పేర్కొన్నారు. ఫోన్ ఇంటర్సెప్షన్ కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే జరిగిందని, ఎలాంటి చట్టవ్యతిరేకత లేదని.. కొన్ని మీడియా వర్గాలు, వ్యక్తులు నిరాధారమైన, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకు ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం లేదని, ఈ దర్యాప్తు పూర్తిగా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా, వృత్తిపరమైన ప్రమాణాలతో జరుగుతున్నదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ధ్రువీకరించని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలను కోరారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణ రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నదని, దీనిలో ప్రభుత్వ జోక్యం గానీ, కక్ష సాధింపుకు గానీ అవకాశంలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ చెప్పారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలవి, వారి మిత్రులవి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. మూడు రోజుల్లో దాదాపు 547 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలను వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం, సీఎం మీద కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.