మానవ సంబంధాలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో.. బంధం అంటే ఇలా ఉండాలని రుజువు చేసింది ఓ సోదరి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఐదేండ్ల బాలుడు అరుదైన అప్లాస్టిక్ అనీమియా (ఎముక మజ్జ లోపం)తో బాధపడుతున్నాడు. మూలకణాలను మార్చడం ద్వారా ఆ బాలుడికి చికిత్సనందించవచ్చని కిమ్స్ వైద్యులు సూచించారు. దీంతో ఇంటర్ చదువుతున్న ఆ బాలుడి సోదరి నేనున్నానంటూ ముందుకొచ్చింది.
తమ్ముడికి మూలకణాలు దానం చేసేంది. కిమ్స్ దవాఖానలో కోలుకుంటున్న తమ్ముడికి శనివారం రాఖీ కట్టి నీకు నేనున్నాను అంటూ ప్రేమను చాటింది. ఈ దృశ్యం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. ఈ సందర్భంగా కిమ్స్ డాక్టర్ నరేందర్కుమార్ మాట్లాడుతూ.. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ఇది నిజమైన నిదర్శనమని ప్రశంసించారు.