రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఇది కోన సీమ కాదు.. పచ్చని చీర కట్టిన సిరిసిల్ల కోన. రాజరాజేశ్వర, అన్నపూర్ణ జలాశయాలతో జలసిరులు పొందిన నేల. పచ్చని అందాలు ఒకవైపు, జలాశయా ల్లాంటి వాగులు మరోవైపు.. తనను తాను చూసుకొని ప్రకృతే పరవశించిపోతుంటే, కెమెరా లెన్సులు తరించిపోవా! రాజన్న సిరిసిల్ల జిల్లా సినిమాలకు షూటింగ్ స్పాట్‌గా మారింది. కాళేశ్వర జలాల రాకతో శ్రీరాజరాజేశ్వర జలాశయం, అన్నపూర్ణ రిజర్వాయర్, సింగసముద్రం చెరువు నిండుకుండల్లా మారి పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పుష్కలంగా నీరుండటంతో ఎటుచూసినా పచ్చనిపైర్లతో కోనసీమ అందాలను మైమరపిస్తున్నాయి. దీంతో జిల్లాలో పలు సినిమాల షూటింగ్‌లు ఊపందుకొన్నాయి. రాజరాజేశ్వర జలాశయ పరివాహక ప్రాంతంలో ఇటీవల హీరో బాలకృష్ణ సినిమా షూటింగ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయంతోపాటు నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామి, గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు, భీముని మల్లారెడ్డిపేట మండలాల్లో షార్ట్ ఫిలింల చిత్రీకరణలు జరిగాయి. ఒకవైపు భూగర్భ జలాలు పెరిగి ఐఏఎస్‌లకు పాఠ్యాంశాలుగా మారిన జిల్లా.. మరోవైపు సినిమా షూటింగ్‌లకు వేదికగా మారడంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.